ఆ తర్వాతే షాహీన్‌బాగ్‌ నిరసనలపై విచారణ

తాజా వార్తలు

Updated : 07/02/2020 14:40 IST

ఆ తర్వాతే షాహీన్‌బాగ్‌ నిరసనలపై విచారణ

దిల్లీ: దేశ రాజధాని షాహీన్‌ బాగ్‌ ప్రాంతంలోని నిరసనలను సవాల్‌ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై దిల్లీ అసెంబ్లీ ఎన్నికల అనంతరం విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అసెంబ్లీ ఎన్నికలపై విచారణ ప్రభావం ఉండొద్దన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘అక్కడ సమస్య ఉందన్న విషయం అర్థమయింది. దీన్ని ఎలా పరిష్కరించాలన్నది చూడాల్సి ఉంది. సోమవారం దీనిపై విచారణ చేపడతాం’’ అని ఎస్‌.కె.కౌల్‌, కె.ఎం.జోసెఫ్‌ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అలాగే దిల్లీ హైకోర్టుకు ఈ వ్యవహారాన్ని ఎందుకు బదిలీ చేయొద్దో కూడా వాదించేందుకు పిటిషనర్‌ తరఫు న్యాయవాదులు సిద్ధంగా ఉండాలని ధర్మాసనం తెలిపింది.

పౌరసత్వ సవరణ చట్టాని(సీఏఏ)కి వ్యవతిరేకంగా షాహీన్‌బాగ్‌లో గత 40 రోజులుగా నిరసన జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో నిరసనకారులు రోడ్డుపై బైఠాయించడం వల్ల ప్రజారావాణాకు తీవ్ర అంతరాయం కలుగుతోందని ప్రముఖ న్యాయవాది అమిత్‌ సాహ్ని సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ట్రాఫిక్‌ మళ్లింపు వల్ల ప్రజలకు సమయం, డబ్బు వృథా అవుతుందని వ్యాజ్యంలో పేర్కొన్నారు. శనివారమే ఎన్నికలు ఉన్న కారణంగా వెంటనే దీనిపై విచారణ చేపట్టాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోరగా.. ఎన్నికలు ఉన్నందునే విచారించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. 

షాహీన్‌ బాగ్‌ నిరసనలు తాజా ఎన్నికల్లో మూడు పార్టీలకూ ప్రచారాస్త్రంగా మారింది. ఆప్‌, కాంగ్రెస్‌ల మద్దతుతోనే ముస్లింలు రహదారిపై ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్నారని.. తాము అధికారంలోకి వచ్చిన మరు క్షణమే శిబిరాన్ని తొలగిస్తామని భాజపా నేతలు ఉద్వేగభరిత ప్రసంగాలు చేశారు. ఒకానొక దశలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఉగ్రవాదితో పోల్చారు. అయితే ఆయన అదే స్థాయిలో వాటిని తిప్పికొట్టారు. శిబిరాన్ని భాజపా ఎందుకు ఎత్తేయలేదని, అధికారం కోసం ఆ పార్టీ మురికి రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ఈ శిబిరానికి పరోక్షంగా మద్దతివ్వడం ద్వారా ముస్లిం ఓట్లపై కాంగ్రెస్‌ గట్టి విశ్వాసముంచింది. ఈ నేపథ్యంలో తాజా సుప్రీంకోర్టు నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. శనివారం దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. 11వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని