అలాంటి సందర్భాల్లో ఉరితీయడం నేరం

తాజా వార్తలు

Updated : 07/02/2020 16:38 IST

అలాంటి సందర్భాల్లో ఉరితీయడం నేరం

తీహాడ్‌ అధికారుల పిటిషన్‌ను కొట్టేసిన దిల్లీ కోర్టు


దిల్లీ: నిర్భయ హత్యాచార దోషులను ఉరి తీసేందుకు డెత్‌ వారెంట్‌ జారీ చేయాలని కోరుతూ తీహాడ్‌ జైలు అధికారులు వేసిన పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు కొట్టేసింది. దోషులకు ఇంకా న్యాయపరమైన హక్కులు ఉన్నందున డెత్‌ వారెంట్‌ జారీ చేయలేమని స్పష్టం చేసింది. నిర్భయ దోషులు ముగ్గురు పెట్టుకున్న క్షమాభిక్ష అభ్యర్థనలు తిరస్కరణకు గురైన నేపథ్యంలో వారిని ఉరి తీసేందుకు అనుమతించాలని కోరుతూ రెండు రోజుల క్రితం తీహాడ్‌ జైలు అధికారులు దిల్లీ పటియాలా హౌస్‌ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై శుక్రవారం అడిషనల్‌ సెషన్స్‌ న్యాయమూర్తి ధర్మేంద్ర రాణా వాదనలు విన్నారు. అనంతరం దాన్ని కొట్టేస్తున్నట్లు తెలిపారు. 

‘దోషులు జీవించేందుకు ఉన్న చట్టపరమైన హక్కులు మిగిలి ఉన్నప్పుడు వారిని ఉరి తీయడం నేరం. దోషులకు ఉన్న న్యాయపరమైన హక్కులను ఉపయోగించుకునేందుకు దిల్లీ హైకోర్టు ఫిబ్రవరి 5 నుంచి వారం రోజులు గడువు ఇచ్చింది. స్పష్టమైన సమాచారం లేకుండా ఊహాజనితంగా ఆలోచించి డెత్‌ వారెంట్‌ జారీ చేయమనడం సబబు కాదు. మీరు దాఖలు చేసిన పిటిషన్‌లో ఎటువంటి సమాచారం లేదు. అందుకే మేం దీన్ని కొట్టేస్తున్నాం’ అని న్యాయమూర్తి రాణా స్పష్టం చేశారు. 

తమకు విధించిన ఉరి అమలుపై స్టే విధించాల్సిందిగా కోరుతూ మరణశిక్ష(ఫిబ్రవరి 1)కు రెండు రోజుల ముందు నలుగురు దోషులు పటియాలా హౌస్‌ కోర్టులో పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. దీంతో ఉరి అమలు వాయిదా పడింది. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు స్టే కొనసాగుతోందని స్పష్టం చేసింది. దీన్ని సవాలు చేస్తూ కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనికి సంబంధించిన విచారణ ఫిబ్రవరి 11న జరపనున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని