వుహాన్‌లో 1000 పడకల ఆస్పత్రి ఎలా ఉంది?

తాజా వార్తలు

Published : 08/02/2020 00:21 IST

వుహాన్‌లో 1000 పడకల ఆస్పత్రి ఎలా ఉంది?

ఇంటర్నెట్‌ డెస్క్‌: చైనాలో వందల మంది ప్రాణాల్ని బలిగొంటూ విజృంభిస్తున్న కరోనా వైరస్‌ ధాటికి ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ మహమ్మారిని నియంత్రించి తమ ప్రజల్ని కాపాడుకొనేందుకు చైనా ప్రభుత్వంతో పాటు అక్కడి పౌరులు ఐకమత్యంతో అహర్నిశలు కృషి చేస్తున్నారు. కరోనాతో రోజురోజుకూ పెరిగిపోతున్న రోగులు.. వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్న వేళ తమ ప్రజల్ని కాపాడుకొనే సంకల్పంతో కేవలం పది రోజుల్లోనే వెయ్యి పడకల ఆస్పత్రిని నిర్మించి చైనా తన సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిన విషయం తెలిసిందే. అయితే, వుహాన్‌లో తాత్కాలికంగా నిర్మించిన ఆ ఆసుపత్రిలో మంగళవారం నుంచి బాధితులకు చికిత్సలు అందిస్తున్నారు. ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న వైద్య పరికరాలు, అందిస్తున్న సేవలపై రోగులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వసతులపై అక్కడి ఓ రోగి అక్కడి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘సౌకర్యాలు ఎంతో బాగున్నాయి. ఇద్దరికి ఒక గది చొప్పున కేటాయించారు. ప్రతి రోగికీ అన్ని వైద్య పరికరాలను అందుబాటులో ఉంచారు. ఆక్సిజన్‌ అందించే పరికరాలతో పాటు బీపీ కొలిచే యంత్రం‌, ఏసీ, టీవీ, బాత్‌రూం తదితర సౌకర్యాలు ఉన్నాయి’’ అని వివరించారు. 

లైవ్‌ స్ట్రీమ్‌లో వివాహ విందు
ఈ వైరస్‌ సృష్టిస్తున్న భయోత్పాతం నేపథ్యంలో అనేక ఆసక్తికర ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ విపత్తు సమయంలో చైనాకు చెందిన కొందరు వ్యక్తులు ఎంతో స్ఫూర్తిదాయకంగా, సమయస్ఫూర్తితో వ్యవహరిస్తున్న కథనాలు ప్రేరణగా నిలుస్తున్నాయి. దేశం కష్టంలో ఉన్నప్పుడు సాటి మనుషుల ప్రాణాల్ని కాపాడుకొనేందుకు కొందరు చూపుతున్న చొరవకు సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. చైనాలోని ఓ వైద్యుడు తన వివాహ తంతును కేవలం పది నిమిషాల్లోనే ముగించుకొని తిరిగి కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు విధులకు హాజరైన ఘటనే ఇందుకు నిలువెత్తు ఉదాహరణ. అలాగే, నూతన సంవత్సర వేడుకలు జరుపుకొనేందుకు చైనాలోని హనాన్‌కు వెళ్లిన ఓ జంట వివాహ విందుకు హాజరుకాలేక అక్కడి నుంచే సింగపూర్‌లోని తమ బంధుమిత్రులు, కుటుంబ సభ్యులతో లైవ్‌ స్ట్రీమింగ్‌ ద్వారా పాల్గొన్న మరో ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే.. సింగపూర్‌కు చెందిన జోసెఫ్‌ యూ, కాంగ్‌ టింగ్‌ ఇద్దరూ నూతన సంవత్సర వేడుకలు జరుపుకొనేందుకు చైనాలోని హునాన్‌ ప్రావిన్స్‌లో పర్యటనకు వెళ్లారు. ఇది హుబెయ్‌ ప్రావిన్స్‌కు సరిహద్దులో ఉంది. ప్రస్తుతం కరోనా వైరస్‌ కోరలు చాచి అనేకమందిని మింగేస్తున్నది ఈ నగరంలోనే. ఈ తరుణంలో గత అక్టోబర్‌లో చైనాలో వివాహం జరుపుకొన్న ఈ జంట.. తమ వివాహ వేడుకకు రాలేకపోయిన బంధువులు, కుటుంబ సభ్యుల కోసం విందు ఏర్పాటు చేశారు. అయితే, వధూవరులిద్దరూ హనాన్‌లో ఉండిపోవడంతో వారి రాకపై కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. దీంతో వారికో ఆలోచన వచ్చింది. వేదిక వద్దకు స్వయంగా వీరు వెళ్లలేకపోయినా తాము ఉంటున్న హోటల్‌ నుంచి లైవ్‌ స్ట్రీమింగ్‌ ద్వారా బంధువులను కలుసుకొని అభినందనలు తెలుపుకొన్నారు.  దీనిపై జోసెఫ్‌ యూ మాట్లాడుతూ.. వ్యక్తిగతంగా కలవలేకపోయినా లైవ్‌ స్ట్రీమింగ్‌ ద్వారా కుటుంబ సభ్యులు, బంధువులను కలుసుకున్నందుకు ఆనందం వ్యక్తంచేశారు. తొలుత అతిథులంతా షాక్‌ అయినప్పటికీ.. ఆ తర్వాత మామూలుగానే అందరితో కలిసి సరదాగా మాట్లాడారని చెప్పుకొచ్చాడు.

పుణె- దిల్లీ విమానంలో చైనా వ్యక్తి వాంతులు 
దిల్లీ నుంచి పుణె వెళ్తున్న ఎయిరిండియా విమానంలో చైనాకు చెందిన వ్యక్తి వాంతులు చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. దీంతో అప్రమత్తమైన విమానంలోని సిబ్బంది పుణె విమానాశ్రయానికి చేరుకోగానే ఉదయం 7గంటల సమయంలో అతడిని స్థానికంగా ఉన్న నాయుడు ఆస్పత్రికి తరలించి ఐసోలేషన్‌ వార్డులో చేర్చారు. అతడి రక్త నమూనాలను సేకరించి పుణెలోని జాతీయ వైరాలజీ ఇనిస్టిట్యూట్‌కు పంపారు. అనంతరం విమానాన్ని శుభ్రం చేయాల్సి రావడంతో దిల్లీకి తిరుగుపయనం కాస్త ఆలస్యమైందని విమానాశ్రయ అధికారులు తెలిపారు. చైనాలోని వుహాన్‌లో మొదలైన ఈ కరోనా ఇప్పటివరకు 25 దేశాలకు వ్యాప్తిచెందింది. ఈ మహమ్మారి బారిన పడి 638 మంది ప్రాణాలు కోల్పోగా.. 31,526 మంది ఈ వ్యాధి లక్షణాలతో చికిత్స పొందుతున్నారు. భారత్‌లో ఇప్పటిదాకా కేరళలో మూడు కేసులు నమోదైన విషయం తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని