సార్స్‌ను మించిన కరోనా..!

తాజా వార్తలు

Updated : 09/02/2020 14:52 IST

సార్స్‌ను మించిన కరోనా..!

బీజింగ్‌: చైనాని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్‌ రోజురోజుకీ అనేక మంది ప్రాణాల్ని మట్టిలో కలిపేస్తోంది. దాని పీచమణచడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా.. పరిస్థితి మాత్రం పెద్దగా అదుపులోకి రావడం లేదు. ఓవైపు మరణిస్తున్న వారి సంఖ్య మరోవైపు దీని బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. శనివారం ఒక్కరోజే 89 మంది మహమ్మారితో పోరాటం చేస్తూ జీవితాన్ని కోల్పోయారు. వీరిలో 81 మంది వైరస్‌కు కేంద్రంగా ఉన్న హుబెయ్‌ ప్రావిన్సు నుంచే ఉండడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. దీంతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 811కు చేరింది. గతంలో సార్స్‌ బారిన పడి ప్రపంచవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య కంటే ఇది అధికం కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. 2002-2003 మధ్య ప్రపంచాన్ని విలవిల్లాడించిన సార్స్‌ వైరస్‌ 774 మందిని బలిగొంది.  

కొత్తగా మరో 2,656 మందిలో ఈ వైరస్‌ని గుర్తించడంతో వైరస్ బారిన పడ్డ వారి సంఖ్య 37,198కి చేరింది. అయితే వైరస్‌ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్యా కాస్త పెరుగుతుండడం కొంత ఉపశమనం కలిగిస్తోంది. శనివారం దాదాపు 600 మంది వైరస్‌ నుంచి విముక్తి పొంది ఇళ్లకు చేరుకున్నారు.

తాజా పరిస్థితిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. చైనాలో వైరస్‌ బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా అదుపులోకి వస్తోందని తెలిపింది. అయితే వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టిందనడం మాత్రం తొందరపాటే అవుతుందని అప్రమత్తం చేసింది. అయితే భారత్‌కు మాత్రం కరోనా భయం లేదని కేంద్ర మంత్రి, కరోనా టాస్క్‌ఫోర్స్‌ సభ్యుడు కిషన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. కేంద్రం పరిస్థితుల్ని ఎప్పకటిప్పుడు సమీక్షిస్తోందని.. కావాల్సిన చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు.

ఇవీ చదవండి: భారత్‌కు కరోనా భయం లేదు

                  వణుకుతున్న డ్రాగన్‌Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని