అవినీతి కేసులో రాకేష్ అస్థానాకు క్లీన్‌చిట్

తాజా వార్తలు

Updated : 12/02/2020 11:35 IST

అవినీతి కేసులో రాకేష్ అస్థానాకు క్లీన్‌చిట్

దిల్లీ: ఒక కేసులో ఓ వ్యాపారి పేరును తప్పించడానికి లంచం తీసుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) మాజీ ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ అస్థానాకు సీబీఐ క్లీన్‌ చిట్ ఇచ్చింది. ఇదే కేసులో మధ్యవర్తిగా వ్యవహరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మనోజ్‌ ప్రసాద్‌ అనే దుబాయికి చెందిన వ్యాపారవేత్తపై అభియోగ పత్రం దాఖలు చేశారు. వీటిని సీబీఐ ప్రత్యేక జడ్జి సంజీవ్‌ అగర్వాల్ ముందుంచినట్లు కోర్టు వర్గాలు తెలిపాయి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్ (రా) చీఫ్‌ ఎస్‌కే గోయల్‌తో పాటు సీబీఐ డీఎస్పీ దేవేందర్‌ కుమార్‌కు కూడా దర్యాప్తు సంస్థ క్లీన్‌ చిట్ ఇచ్చింది. దీనికి సంబంధించిన తుది నివేదికను న్యాయస్థానం బుధవారం పరిశీలించనుంది.

2017లో మాంసం ఎగుమతి వ్యాపారవేత్త మోయిన్‌ ఖురేషిపై మనీలాండరింగ్, అవినీతి, అక్రమాస్తుల ఆరోపణలు రాగా ఆయనపై సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. దీనిపై రాకేష్‌ అస్థానా నేతృత్వంలో ప్రత్యేక బృందం (సిట్) ఏర్పాటైంది. ఈ కేసు నుంచి తనను తప్పించేందుకు మనోజ్‌ ప్రసాద్, అతని సోదరుడు సోమేష్‌కు రెండు కోట్లు ఇచ్చినట్లు హైదరాబాద్‌కు సానా సతీష్ అనే వ్యాపారవేత్త ఆరోపించారు. రాకేష్‌ అస్థానాతో తమకు ఉన్న పరిచయాలను ఉపయోగించి సీబీఐ విచారణ నుంచి తప్పిస్తామని వారు హామీ ఇచ్చారని అప్పట్లో సతీష్ ఆరోపించారు. ఇదే విషయాన్ని ఆయన విచారణలో కూడా వెల్లడించారు. దీంతో సతీష్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రాకేష్‌ అస్థానాపై నాటి సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మ కేసు నమోదు చేశారు.

ఈ కేసుకు సంబంధించి మనోజ్‌ ప్రసాద్‌ను అక్టోబరు 17, 2018న అరెస్టు చేశారు. అదే ఏడాది డిసెంబరు 18న ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. దీనిపై 60 రోజుల్లోగా చార్జీషీట్ దాఖలు చేయడంలో సీబీఐ విఫలమైంది. అంతే కాకుండా ఇదే కేసులో సీబీఐ సిట్‌ డీఎస్పీ దేవేందర్‌ కుమార్‌ను కూడా అక్టోబరు 23, 2019న అరెస్టు చేయగా ఆయన వారం తర్వాత అక్టోబరు 31న బెయిల్‌పై విడుదలయ్యారు. తాజాగా ఒక్క మనోజ్‌ ప్రసాద్ మినహా ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులకు దర్యాప్తు సంస్థ క్లీన్ చిట్ ఇవ్వడం గమనార్హం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని