కొవిడ్‌: 1662కు చేరిన మృతుల సంఖ్య

తాజా వార్తలు

Updated : 16/02/2020 10:36 IST

కొవిడ్‌: 1662కు చేరిన మృతుల సంఖ్య

బీజింగ్‌: చైనా ప్రజల పాలిట మృత్యుశాపంగా మారిన కొవిడ్‌-19 విలయతాండవం ఇంకా కొనసాగుతూనే ఉంది. కట్టడికి ఎన్ని ప్రయత్నాలు చేసినా.. విజృంభణ మాత్రం ఆగడం లేదు. తాజాగా చైనాలో మరో 139 మందిని ఈ మహమ్మారి బలిగొంది. వీరంతా హుబెయ్ ప్రావిన్సుకు చెందిన వారే. దీంతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,662కు చేరింది. మరో 1,843 మంది కొత్తవారికి ఈ వైరస్‌ సోకింది. వరుసగా మూడోరోజు ఈ వ్యాధి సోకిన వారి సంఖ్య స్వల్పంగా తగ్గడం కొంతమేర ఊరట కలిగించే అంశం. దేశవ్యాప్తంగా వైరస్ బాధితుల సంఖ్య 69,000 దాటింది. ఇక వైరస్‌ నుంచి 9,465 మంది విముక్తి పొందారు. తాజా పరిస్థితులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) స్పందించింది. చైనా సహా ఇతర ఆసియా దేశాల్లోనూ వైరస్ వ్యాప్తి కొనసాగుతుండడం ఆందోళన కలిగిస్తోందని సంస్థ చీఫ్ టెడ్రోస్‌ అధనోమ్‌ అన్నారు. అలాగే చైనాలో వైరస్ బాధితుల్ని గుర్తిస్తున్న విధానంపై ప్రభుత్వాన్ని వివరణ కోరామని తెలిపారు. 

* జపాన్‌ నౌకలో ఉన్న అమెరికా పౌరుల్ని తీసుకెళ్లేందుకు ఆ దేశం ఈరోజు ప్రత్యేక విమానం పంపనుంది. దాదాపు రెండు వారాల నుంచి వారు నౌకలోనే ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు నౌకలో 285 మందికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. 

* కాంబోడియా తీరంలో ఆగిన మరో నౌక వెస్టర్‌డ్యామ్‌లో ఓ అమెరికా మహిళకు వైరస్ సోకినట్లు గుర్తించారు. ఇప్పటికే అందులోని ప్రయాణికులను బయటకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

* సింగపూర్‌లో మరో ఐదుగురికి వైరస్‌ సంక్రమించింది. దీంతో ఆ దేశంలో బాధితుల సంఖ్య 72కు ఎగబాకింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని