‘ఆమెను తిప్పిపంపడం సమంజసమే’

తాజా వార్తలు

Published : 18/02/2020 13:30 IST

‘ఆమెను తిప్పిపంపడం సమంజసమే’

డెబీ అబ్రహాంను అడ్డుకోవడంపై కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయం

దిల్లీ: కశ్మీర్‌ సందర్శించడానికి వచ్చిన బ్రిటన్‌ లేబర్‌ పార్టీ పార్లమెంటు సభ్యురాలు, ‘ఆల్‌ పార్టీ పార్లమెంటరీ గ్రూప్‌ ఫర్‌ కశ్మీర్‌’ ఛైర్‌పర్సన్‌ డెబీ అబ్రహాంను దిల్లీ విమానాశ్రయం నుంచి తిప్పి పంపడాన్ని కాంగ్రెస్‌ నాయకుడు అభిషేక్‌ మను సింఘ్వీ సమర్థించారు. భారత సార్వభౌమత్వానికి విఘాతం కలిగించే ప్రతిచర్యను తిప్పి కొట్టాల్సిందేనని తేల్చి చెప్పారు. ‘‘డెబీని తిప్పి పంపడం ముమ్మాటికీ సమంజసమైన చర్య. ఆమె కేవలం ఒక ఎంపీ మాత్రమే కాదు. పాక్‌, ఐఎస్‌ఐతో చేతులు కలిపి వారికి మద్దతుగా నిలుస్తున్న వ్యక్తి. భారత సార్వభౌమత్వంపై చేసే ప్రతి దాడిని ఇదే రకంగా తిప్పికొట్టాలి’’ అని ట్విటర్‌లో సింఘ్వీ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.

అయితే సింఘ్వీ కంటే ముందు మరో సీనియర్‌ నాయకుడు శశి థరూర్‌.. డెబీని అడ్డుకోవడాన్ని తప్పుబట్టారు. కశ్మీర్‌లో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటే విమర్శకులను ఆహ్వానించాలి అని వ్యాఖ్యానించారు. అప్పుడే అక్కడి పరిస్థితులపై వ్యక్తమవుతున్న భయాందోళనలు తొలగిపోతాయని అభిప్రాయపడ్డారు. ఆరోపణలకు అడ్డుకట్ట వేయాలంటే విమర్శకులను అనుమతించాల్సిన అవసరం లేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాయబారులు, ప్రతినిధులను మాత్రమే కాకుండా.. ‘ఆల్‌ పార్టీ పార్లమెంటరీ గ్రూప్‌ ఫర్‌ కశ్మీర్‌’ ఛైర్‌పర్సన్‌ని అనుమతించడం ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. 

అధికరణ 370 రద్దును వ్యతిరేకిస్తున్న డెబీ అబ్రహాం ఈ-వీసాను భారత ప్రభుత్వం రద్దు చేసింది. సోమవారం ఉదయం దిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న ఆమెకు ఇమిగ్రేషన్‌ అధికారులు ప్రవేశం నిరాకరించారు. వీసా రద్దయినట్టు చెప్పారు. దీంతో డెబీ అక్కడి నుంచి దుబాయ్‌ వెళ్లిపోయారు. వీసా రద్దయిన విషయాన్ని తాము ముందుగానే డెబీకి ఈ-మెయిల్‌ ద్వారా సందేశమిచ్చినట్టు భారత హోంశాఖ ప్రతినిధి చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని