ట్రంప్‌ బీస్ట్‌.. భద్రతలో బెస్ట్‌

తాజా వార్తలు

Updated : 23/02/2020 16:44 IST

ట్రంప్‌ బీస్ట్‌.. భద్రతలో బెస్ట్‌

అమెరికా అధ్యక్షుడి కారు ప్రత్యేకతలెన్నో..

ఇంటర్నెట్‌డెస్క్‌: తొలిసారిగా భారత్‌లో అడుగుపెడుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పర్యటనలో విశేషాలెన్నో.. ఈ పర్యటన కోసం భారీ భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వేదికలు అంగరంగ వైభవంగా ముస్తాబవుతున్నాయి. అటు భారత్‌లో ట్రంప్‌ ప్రయాణించేందుకు ఆయన వాహనశ్రేణి కూడా ఇప్పటికే గుజరాత్‌ చేరుకుంది. కాగా.. ఇందులో ట్రంప్‌ కూర్చునే ‘ది బీస్ట్‌’ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇది ప్రపంచంలోనే అత్యంత భద్రత కలిగిన, సురక్షితమైన కారు. ట్రంప్‌ పర్యటన సందర్భంగా బీస్ట్‌ విశేషాలు ఓసారి చూద్దాం..

అధ్యక్షుడి వెంటే..

అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే కారే ‘ది బీస్ట్‌’. దీన్ని కాడిలాక్‌ వన్‌, ఫస్ట్‌ కార్‌ అని కూడా పిలుస్తుంటారు. 1963లో అప్పటి అధ్యక్షుడు జాన్‌ ఎఫ్‌ కెనడీ హత్య తర్వాత అధ్యక్షుడి కారును మరింత భద్రంగా తీర్చిదిద్దాలని అమెరికా ప్రభుత్వం భావించింది. ఇందుకోసం భారీగానే వెచ్చిస్తున్నారు. ప్రస్తుతం ట్రంప్‌ వినియోగిస్తున్న సరికొత్త కాడిలాక్‌ మోడల్‌ను 2018 సెప్టెంబరు 24న కాన్వాయ్‌లోకి ప్రవేశపెట్టారు. అత్యంత అధునాతన ఫీచర్లతో, భారీ భద్రతా ప్రమాణాలతో ఈ కారును తయారుచేశారు. అధ్యక్షుడు ఏ దేశానికి వెళ్లినా బీస్ట్‌ కూడా అక్కడ అడుగుపెట్టాల్సిందే.

అదిరిపోయే ఫీచర్లు..

* ఈ కారు అద్దాలు ఐదు అంగుళాల మందంతో, డోర్లు 8 అంగుళాల మందంతో ఉంటాయి. గాజు, పాలీకార్బొనేట్‌తో ఐదు లేయర్లలో అద్దాలను తయారు చేశారు. కేవలం డ్రైవర్‌ విండోను మాత్రం 3 అంగుళాల మేర తెరుచుకుంటుంది. మిగతా అద్దాలేవీ తెరుచుకోవు. కారు అద్దాలన్నీ పూర్తిగా బుల్లెట్‌ ప్రూఫ్‌ కలిగినవి. రసాయన దాడులను కూడా ఇవి తట్టుకుంటాయి.

టైర్లు కూడా అత్యాధునిక టెక్నాలజీతో తయారు చేశారు. ఇవి పగిలిపోవు.. పంక్చర్‌ కావు. ఒకవేళ డ్యామేజ్‌ అయినా లోపల ఉండే స్టీల్‌ రీమ్‌లతో ప్రయాణించే సామర్థ్యం దీనికి ఉంది. 

* స్టీల్‌, అల్యూమినియం, టైటానియం, సిరామిక్‌తో తయారు చేసిన ఈ కారు బాంబులను కూడా తట్టుకుంటుంది. 

* కారు ముందు భాగంలో టియర్‌ గ్యాస్‌ గ్రనేడ్‌ లాంఛర్లు, నైట్‌ విజన్‌ కెమెరాలుంటాయి. కారును ఎవరైనా ఆపేందుకు ప్రయత్నిస్తే వెంటనే బాష్పవాయువు ప్రయోగించొచ్చు. ఇక నైట్‌ విజన్‌ కెమెరాల ద్వారా రాత్రి పూట కూడా స్పష్టంగా కన్పిస్తుంది. వెనుక భాగంలో ఫైర్‌ఫైటింగ్‌ వ్యవస్థ, పొగను తొలగించే స్క్రీన్‌ డిస్పెన్సర్లు ఉన్నాయి. 

* డ్రైవర్‌ క్యాబిన్‌లో సరైన కమ్యూనికేషన్‌, జీపీఎస్‌ ట్రాకింగ్‌ వ్యవస్థ ఉంటుంది. అంటే కారు ఎక్కడకు వెళ్లినా ఇట్టే పసిగట్టే వీలుంటుంది. ఇక సాదాసీదా డ్రైవర్లు దీన్ని నడపడం కుదరదు. బీస్ట్‌ డ్రైవర్‌కు యూఎస్‌ సీక్రెట్‌ సర్వీస్‌తో ముందుగానే శిక్షణ ఇస్తారు. అత్యవసర సమయాల్లో అధ్యక్షుడిని ఎలా కాపాడాలనే దానిపై ట్రైనింగ్‌ ఇస్తారు. ప్రతి రోజు డ్రైవర్‌కు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. క్లిష్టపరిస్థితుల్లో 180 డిగ్రీల ‘జె టర్న్‌’తో కారును తప్పించేలా డ్రైవర్‌కు శిక్షణ ఇస్తారు. 

వెనుక భాగంలో అధ్యక్షుడితో పాటు మరో నలుగురు కూర్చోవచ్చు. లోపలి భాగం గాజుతో వేరుచేసి ఉంటుంది. దీన్ని అధ్యక్షుడు మాత్రమే కిందికి దించే వీలుంది. అధ్యక్షుడి కుర్చీ వద్ద శాటిలైట్‌ ఫోన్‌ ఉంటుంది. దీని ద్వారా నేరుగా ఉపాధ్యక్షుడు, పెంటగాన్‌కు ఫోన్‌ చేసి మాట్లాడొచ్చు. 

* అత్యవసర సమయాల్లో అవసరమయ్యే పానిక్‌ బటన్‌తో పాటు ఆక్సిజన్‌ సరఫరా కూడా ఉంది. అధ్యక్షుడి బ్లడ్‌గ్రూప్‌ సంబంధించిన బ్లడ్‌ బ్లాగ్‌లు కూడా అందుబాటులో ఉంటాయి. 

ఇంధన ట్యాంక్‌ను కూడా అధునాతనంగా తీర్చిదిద్దారు. ఏదైనా ఢీకొట్టిన ఈ ట్యాంక్‌ పేలదు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని