‘అస్థానాకు వ్యతిరేకంగా ఆధారాలున్నాయి’

తాజా వార్తలు

Published : 29/02/2020 00:35 IST

‘అస్థానాకు వ్యతిరేకంగా ఆధారాలున్నాయి’

దిల్లీ కోర్టుకు తెలిపిన మాజీ విచారణాధికారి బస్సీ

దిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) మాజీ ప్రత్యేక డైరెక్టర్‌ రాకేష్‌ అస్థానా లంచం తీసుకున్నారన్న కేసులో స్పష్టమైన ఆధారాలు ఉండేవని ఈ కేసును గతంలో దర్యాప్తు చేసిన అజయ్‌ కుమార్‌ బస్సీ ఆరోపించారు. ఈ మేరకు ఆయన తన వాదనను శుక్రవారం దిల్లీ కోర్టుకు వినిపించారు. ప్రస్తుతం ఈ కేసులో విచారణ జరుపుతున్న సతీష్‌ దగర్‌..  అస్థానా సహా ఈ అంశంతో సంబంధం ఉన్న ఇతర అధికారులను కాపాడేందుకు ప్రయత్నించారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. దీంతో న్యాయమూర్తి సంజీవ్‌ అగర్వాల్‌ కలగజేసుకొని ఇరువురిని వారించినట్లు తెలుస్తోంది. ఇటీవలే ఈ కేసులో రాకేష్‌ అస్థానాకు సీబీఐ క్లీన్‌ చిట్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో అజయ్‌ కుమార్‌ ఆరోపణలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

రాకేష్‌ అస్థానాపై సీబీఐ జరిపిన విచారణ తీరుపై ఫిబ్రవరి 12న కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితులు యథేచ్ఛగా బయట ఎలా తిరుగుతున్నారని ప్రశ్నించింది. సరైన ఆధారాలు లేవన్న కారణంతో రాకేష్‌ అస్థానా సహా మరికొంత మంది అధికారులకు పేర్లను అభియోగపత్రంలో 12వ కాలమ్‌లో సీబీఐ చేర్చింది.

2017లో మాంసం ఎగుమతి వ్యాపారవేత్త మోయిన్‌ ఖురేషిపై మనీలాండరింగ్, అవినీతి, అక్రమాస్తుల ఆరోపణలు రాగా ఆయనపై సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. దీనిపై రాకేష్‌ అస్థానా నేతృత్వంలో ప్రత్యేక బృందం (సిట్) ఏర్పాటైంది. ఈ కేసు నుంచి తనను తప్పించేందుకు మనోజ్‌ ప్రసాద్, అతని సోదరుడు సోమేష్‌కు రెండు కోట్లు ఇచ్చినట్లు హైదరాబాద్‌కు సానా సతీష్ అనే వ్యాపారవేత్త ఆరోపించారు. రాకేష్‌ అస్థానాతో తమకు ఉన్న పరిచయాలను ఉపయోగించి సీబీఐ విచారణ నుంచి తప్పిస్తామని వారు హామీ ఇచ్చారని అప్పట్లో సతీష్ ఆరోపించారు. ఇదే విషయాన్ని ఆయన విచారణలో కూడా వెల్లడించారు. దీంతో సతీష్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రాకేష్‌ అస్థానాపై నాటి సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మ కేసు నమోదు చేశారు.

ఈ కేసుకు సంబంధించి మనోజ్‌ ప్రసాద్‌ను అక్టోబరు 17, 2018న అరెస్టు చేశారు. అదే ఏడాది డిసెంబరు 18న ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. దీనిపై 60 రోజుల్లోగా ఛార్జిషీట్ దాఖలు చేయడంలో సీబీఐ విఫలమైంది. అంతే కాకుండా ఇదే కేసులో సీబీఐ సిట్‌ డీఎస్పీ దేవేందర్‌ కుమార్‌ను కూడా అక్టోబరు 23, 2019న అరెస్టు చేయగా ఆయన వారం తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. ఒక్క మనోజ్‌ ప్రసాద్ మినహా ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులకు దర్యాప్తు సంస్థ క్లీన్ చిట్ ఇచ్చింది.      


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని