‘ర్యాలీలో పాల్గొన్నారు.. దేశం వీడండి’

తాజా వార్తలు

Published : 02/03/2020 01:33 IST

‘ర్యాలీలో పాల్గొన్నారు.. దేశం వీడండి’

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో పౌరసత్వ చట్ట వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న ఓ విదేశీ విద్యార్థికి చేదు అనుభవం ఎదురైంది. వెంటనే అతడు దేశాన్ని వదిలిపోవాలంటూ కోల్‌కతాలోని విదేశాంగ ప్రాంతీయ కార్యాలయం (ఎఫ్‌ఆర్‌ఆర్‌వో)నోటీసులు అందజేయడం వర్శిటీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు జాదవ్‌పూర్‌ వర్శిటీ వర్గాలు వెల్లడించాయి. పోలండ్‌కు చెందిన కమిల్‌ సీడ్‌సిన్‌స్కి అనే వ్యక్తి  విద్యార్థి వీసాతో భారత్‌ వచ్చి జాదవ్‌పూర్‌ వర్శిటీలో చదువుతున్నాడు. ఇతడు గతేడాది డిసెంబర్‌లో మౌలాలీ ప్రాంతంలో నిర్వహించిన సీఏఏ వ్యతిరేక ర్యాలీలో అతడు పాల్గొన్నాడు. ఈ క్రమంలో అతడు ఓ వార్తా సంస్థతో మాట్లాడాడు. అతడి మాటలు తర్వాత రోజున ఆ పత్రికలో ప్రచురితమైంది. ఇందుకు సంబంధించిన కాపీలను కొందరు విదేశాంగ కార్యాలయ అధికారులకు సమర్పిస్తూ ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు ఇటీవల అతడిని కార్యాలయానికి పిలిచి, పక్షం రోజుల్లో దేశాన్ని వదిలి వెళ్లాలని నోటీసులు ఇచ్చినట్లు జేయూ వర్గాలు మీడియాకు వెల్లడించాయి. 

ఇటీవల విశ్వభారతి వర్శిటీలో చదువుతున్న మరో బంగ్లాదేశీ విద్యార్థిని అఫ్సర్‌ అనికకు సైతం అధికారులు ఇదే తరహా నోటీసులు అందజేసినట్లు సమాచారం. ఆమె ప్రభుత్వ వ్యతిరేక కార్యాకలాపాల్లో పాల్గొంటున్నట్లు గుర్తించారు. దీంతో ఆ ఇద్దరు విదేశీ విద్యార్థులు భవిష్యత్తులో ఇలాంటి కార్యకలాపాల్లో పాల్గొనమని.. తమపై తీసుకున్న చర్యలను మరోసారి పరిశీలించాలని అధికారులకు విజ్ఞప్తి చేసుకున్నట్లు వర్శిటీ వర్గాలు తెలిపాయి. దీనిపై ఎఫ్‌ఆర్‌ఆర్‌వో స్పందిస్తూ తుది నిర్ణయం దిల్లీ కార్యాలయం తీసుకుంటుందని చెప్పినట్లు తెలిపారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని