‘‌370రద్దు’పై విస్తృత ధర్మాసనం అవసరం లేదు

తాజా వార్తలు

Updated : 02/03/2020 12:19 IST

‘‌370రద్దు’పై విస్తృత ధర్మాసనం అవసరం లేదు

దిల్లీ: జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణకు విస్తృత ధర్మాసనం అవసరం లేదని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ పిటిషన్ల విచారణను ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి బదిలీ చేసేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ప్రస్తుతమున్న జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనమే విచారిస్తుందని తేల్చిచెప్పింది. 

జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తూ గతేడాది ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అంతేగాక, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. అయితే ఈ రద్దు రాజ్యాంగ బద్ధతను సవాల్‌ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానంలో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపుతోంది. 

ఇదిలా ఉండగా.. ఆర్టికల్‌ 370 రద్దుపై దాఖలైన అన్ని పిటిషన్లను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలని కోరుతూ పీపుల్స్‌ యూనియన్‌ ఆఫ్‌ సివిల్‌ లిబర్టీస్ ఎన్జీవో, జమ్ముకశ్మీర్‌ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ తదితరులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అధికరణం 370కి సంబంధించి ప్రేమ్‌నాథ్‌ వర్సెస్‌ జమ్మూ-కశ్మీర్‌(1959), సంపత్‌ ప్రకాశ్‌ వర్సెస్‌ జమ్మూకశ్మీర్‌(1970) కేసుల్లో అత్యున్నత న్యాస్థానం ఇచ్చిన తీర్పులు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయని, అందువల్ల తాజా పిటిషన్లపై విచారణను ఏడుగురు సభ్యుల ధర్మసనానికి బదిలీ చేయాలని పిటిషన్‌దారులు కోరారు. 

వీరి వాదనను కేంద్రం తోసిపుచ్చింది. 1959, 1970 తీర్పులు రెండు వేర్వేరు అంశాలకు సంబంధించినవి, వాటిని తాజా పిటిషన్లతో పోల్చడం సరికాదని కేంద్రం తరఫున అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ పేర్కొన్నారు. అంతేగాక, ఆర్టికల్‌ 370 రద్దు అనేది ముగిసిన కథ అని, ఆ సత్యాన్ని అంగీకరించడం తప్ప మరో ప్రత్యామ్నాయమేదీ లేదని తేల్చిచెప్పారు. పిటిషన్‌దారులు కోరినట్లు ఏడుగురు సభ్యుల విస్తృతస్థాయి ధర్మాసనానికి విచారణ బాధ్యతను అప్పగించాల్సిన అవసరం లేదని సూచించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం జనవరి 23న తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. తాజాగా విచారణ బదిలీ అభ్యర్థనను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.  Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని