నిర్భయ దోషుల ఉరి అమలుపై స్టే

తాజా వార్తలు

Updated : 02/03/2020 18:58 IST

నిర్భయ దోషుల ఉరి అమలుపై స్టే

మూడోసారీ నిలిచిన మరణశిక్ష అమలు

దిల్లీ: నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషుల ఉరితీత మరోసారి వాయిదా పడింది. నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలుపై పటియాల హౌస్ కోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు డెత్‌ వారెంట్లపై స్టే కొనసాగుతుందని తెలిపింది. వాస్తవానికి రేపు ఉదయం (మార్చి 3న) నలుగురు దోషులనూ ఉరి తీయాల్సి ఉంది. తమ డెత్ వారెంట్లపై స్టే ఇవ్వాలంటూ దోషుల్లో ఒకరైన పవన్ గుప్తా దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు స్టే విధించింది.

చివరి ప్రయత్నాలు..

ఉరిశిక్షపై తాను మరోసారి రాష్ట్రపతికి క్షమాభిక్ష అభ్యర్థన పెట్టుకున్నానని, అందువల్ల డెత్‌ వారెంట్‌పై స్టే ఇవ్వాలని కోరుతూ దోషుల్లో ఒకడైన అక్షయ్‌ పిటిషన్‌ దాఖలు చేశాడు. దీనిపై విచారణ జరిపిన పటియాల హౌస్‌ కోర్టు అక్షయ్‌ అభ్యర్థనను కొట్టివేసింది. రేపటి ఉరితీతపై స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది. అయితే ఇదే సమయంలో మరో దోషి పవన్‌ గుప్తా కూడా పిటిషన్‌ దాఖలు చేశాడు. పవన్‌ గతవారం సుప్రీంకోర్టులో క్యూరేటివ్‌ పిటిషన్‌ దాఖలు చేయగా.. నేడు సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో అతడు రాష్ట్రపతికి క్షమాభిక్ష అభ్యర్థన పెట్టుకున్నాడు. ఈ విషయాన్ని దోషి తరఫు న్యాయవాది ఏపీ సింగ్‌ దిల్లీ కోర్టు దృష్టికి తెచ్చారు. క్షమాభిక్ష అభ్యర్థన రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్న దృష్ట్యా ఉరితీతపై స్టే ఇవ్వాలని పవన్‌ న్యాయస్థానాన్ని కోరడంతో.. కోర్టు స్టే విధించింది.

కోర్టు అసంతృప్తి..

అయితే పవన్‌ అభ్యర్థనపై దిల్లీ కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. క్యూరేటివ్‌, క్షమాభిక్ష పిటిషన్లు పెట్టుకోడానికి ఎందుకు ఆలస్యం చేశారని దోషి తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. ‘ఒక వ్యక్తి చేసే తప్పుడు చర్య వల్ల ఎలాంటి పరిణామాలు వస్తాయో మీకు తెలియదా’ అంటూ న్యాయవాదిని నిలదీసింది.

వాయిదా మూడోసారి..
నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలు వాయిదా పడడం ఇది మూడోసారి. నలుగురు దోషులూ ఒకరి తర్వాత ఒకరు తమకున్న న్యాయ అవకాశాలను వినియోగించుకోవడంతో మరణశిక్ష అమలు ఆలస్యమవుతోంది. తొలిసారి ఈ ఏడాది జనవరి 22న వారిని ఉరి తీయాలని పటియాల హౌస్‌ కోర్టు డెత్‌ వారెంట్లు జారీ చేసింది. నిందితులు న్యాయపరమైన అవకాశలు వినియోగించుకోవడంతో ఉరి అమలు వాయిదా పడింది. ఫిబ్రవరి 1న ఉరితీయాలని రెండోసారి డెత్‌ వారెంట్ చేసినప్పుడూ మళ్లీ అదే కారణంతో వాయిదా పడింది. మార్చి 3న ఉరి తీయాలని ఇటీవల ఇచ్చిన డెత్‌ వారెంట్లపై తాజాగా మరోసారి స్టే విధించడం గమనార్హం.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని