అష్రాఫ్‌ ఘనీని అభినందించిన ట్రంప్‌

తాజా వార్తలు

Updated : 03/03/2020 12:31 IST

అష్రాఫ్‌ ఘనీని అభినందించిన ట్రంప్‌

ఓ ప్రకటనలో వెల్లడించిన శ్వేతసౌధం

వాషింగ్టన్‌: అఫ్గానిస్థాన్‌లో శాంతి నెలకొల్పేందుకు అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీ తీసుకున్న చర్యల్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అభినందించారని శ్వేతసౌధం ఓ ప్రకటనలో తెలిపింది. అమెరికా, తాలిబన్ల మధ్య శాంతి ఒప్పందం కుదిరిన తర్వాత ఘనీ తీసుకున్న చర్యల్ని ట్రంప్ కొనియాడారని వెల్లడించింది. ఈ మేరకు ఆయన ఘనీతో ఫోన్‌లో మాట్లాడారని పేర్కొంది. శాంతి స్థాపన కోసం ఇరు దేశాధినేతలు మున్ముందు మరింత కలిసి పనిచేసేందుకు అంగీకరించారని తెలిపింది. ఒప్పందం తదుపరి పరిణామాల్లో భాగంగా అఫ్గాన్ ప్రభుత్వం తాలిబన్లతో చర్చలు జరపాల్సిన అవసరం ఉంది. తద్వారా యుద్ధానికి శాశ్వత ముగింపు పలికి, దేశ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించాల్సి ఉంటుంది.

మరోవైపు తాలిబన్లతో కుదిరిన శాంతి ఒప్పందం షరతులతో కూడినదే అని అమెరికా రక్షణ కార్యదర్శి మార్క్‌ ఎస్పర్‌ స్పష్టం చేశారు. ఏళ్లుగా జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలకడానికి ఇది ముందడుగు అని వ్యాఖ్యానించారు. అమెరికా సైనికుల త్యాగాల వల్లే ఈ ఒప్పందం సాధ్యమైందన్నారు. దోహాలో శనివారం తాలిబన్‌, అమెరికా మధ్య శాంతిఒప్పదం కుదిరిన విషయం తెలిసిందే. ఈ ఒప్పందం ప్రకారం.. తాలిబన్‌ అన్ని షరతులకు కట్టుబడితే 14 నెలల్లో అమెరికా, దాని మిత్రపక్షాల బలగాలు అఫ్గాన్‌ నుంచి వైదొలుగుతాయి. ఒప్పందం కుదిరిన 135 రోజుల్లో అక్కడున్న మొత్తం 14 వేల మంది సైనికుల్లో 8600 మందిని అమెరికా వెనక్కి తీసుకుంటుంది. అదే నిష్పత్తిలో అమెరికా మిత్ర పక్షాలు కూడా తమ బలగాలను నాలుగు నెలల్లోగా ఉపసంహరించుకుంటాయి. తమ వద్ద బందీలుగా ఉన్న వారిని అమెరికా, తాలిబన్లు పరస్పరం మార్పిడి చేసుకుంటాయి. దాదాపు 5వేల మంది తాలిబన్‌ ఖైదీలు, అఫ్గాన్‌ సైన్యానికి చెందిన వెయ్యి మంది మార్చి 10 నాటికి విడుదల కావాల్సి ఉంది. అప్పటికల్లా అఫ్గాన్‌ ప్రభుత్వానికి, తాలిబన్‌కు మధ్య చర్చలు మొదలవుతాయి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని