డెత్‌ వారెంట్లు జారీ చేయండి: దిల్లీ ప్రభుత్వం

తాజా వార్తలు

Published : 05/03/2020 00:25 IST

డెత్‌ వారెంట్లు జారీ చేయండి: దిల్లీ ప్రభుత్వం

దిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దిల్లీ ప్రభుత్వం పటియాలా హౌస్‌ కోర్టును ఆశ్రయించింది. దోషులు న్యాయపరంగా ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకున్నారని అయితే అవి వారి నిర్దోషిత్వాన్ని నిరూపించలేకపోయాయని తెలిపింది. వారి ఉరిశిక్షకు తాజాగా డెత్‌ వారెంట్లు జారీ చేయాలని కోరింది. దోషుల్లో చివరి వాడైన పవన్‌ గుప్తా క్షమాభిక్ష పిటిషన్‌ కూడా తిరస్కరణకు గురైన నేపథ్యంలో ఈ మేరకు బుధవారం పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై రేపటిలోగా జవాబు ఇవ్వాలని దోషులకు కోర్టు నోటీసులు జారీ చేసింది.

మరణశిక్షను వాయిదా వేసేందుకు నిర్భయ దోషులు అక్షయ్‌ ఠాకూర్‌ (31), పవన్‌ గుప్తా (25), వినయ్‌ శర్మ (26), ముకేశ్‌సింగ్‌ (32) శతవిధాలా ప్రయత్నించారు. మార్చి 3న ఉరి తీయాలంటూ ఫిబ్రవరి 17న పటియాలా హౌస్‌ కోర్టు డెత్‌వారెంట్లు జారీ చేసింది. దీంతో అప్పటి వరకు న్యాయపరమైన అవకాశాలూ ఉపయోగించుకోని ఏకైక దోషి పవన్‌ గుప్తా సుప్రీం కోర్టులో క్యూరేటివ్‌ పిటిషన్‌ వేశాడు. అది తిరస్కరణకు గురవ్వడంతో రాష్ట్రపతి క్షమాభిక్షకు దరఖాస్తు పెట్టుకున్నాడు. దీన్ని సాకుగా చూపుతూ డెత్‌వారెంట్లపై స్టే విధించాలంటూ కోర్టులో పిటిషన్‌ వేయడంతో మూడోసారి ఉరిశిక్ష అమలు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి అతడి క్షమాభిక్ష పిటిషన్‌ను బుధవారం తిరస్కరించారు. 

దోషులకున్న న్యాయపరమైన అన్ని అవకాశలూ మూసుకుపోయాయని, వారికి ఎలాంటి దారులూ లేవని దిల్లీ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఉరిశిక్షకు కొత్త తేదీలను జారీ చేయాలంది. ఈ పిటిషన్‌పై సమాధానం తెలపాలంటూ అదనపు సెషన్స్‌ జడ్జి ధర్మేంద్ర రాణా నిర్భయ దోషులకు నోటీసులు జారీ చేశారు. అయితే, నోటీసులు అవసరం లేదని ప్రాసిక్యూషన్‌ తరఫు న్యాయవాది వాదించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21 ప్రకారం అవతలి వ్యక్తి వాదన వినాలన్న సూత్రాన్ని విస్మరించరాదని ఈ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని