కరోనాపై పోరాటానికి సోషల్‌ మీడియా ఉద్యమం

తాజా వార్తలు

Published : 06/03/2020 14:25 IST

కరోనాపై పోరాటానికి సోషల్‌ మీడియా ఉద్యమం

మనం ఎదుర్కోగలం: ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ 

జెనీవా: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌(కొవిడ్‌-19) విజృంభిస్తున్న నేపథ్యంలో దీనిని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) చర్యలు చేపట్టింది. ‘‘బీ రెడీ ఫర్‌ కొవిడ్‌-19’’ పేరుతో ఓ కొత్త సోషల్‌ మీడియా ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ‘‘కరోనా విషయంలో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని మాకు తెలుసు. అది సహజం.. అయితే సరైన సమాచారాన్ని అందించటం ద్వారా వారి భయాన్ని తొలగించొచ్చు. ప్రమాదాన్ని తగ్గించొచ్చు. ఈ లక్ష్యంతోనే మేము ‘‘బీ రెడీ ఫర్‌ కొవిడ్‌-19’’ను మొదలుపెట్టాము.’’ అని డబ్ల్యుహెచ్‌ఓ డైరక్టర్‌ జనరల్ జనరల్‌ టెడ్రోస్‌ అధానోమ్‌ గెబ్రెసస్‌ ప్రకటించారు.

115 దేశాల్లో కరోనా వ్యాధి లేదు
‘ప్రపంచంలో 90 దేశాల్లో కరోనా ఉన్న మాట నిజమే .. కానీ 115 దేశాల్లో ఈ వ్యాధి లేదనే విషయాన్ని కూడా మనం గమనించాలి. కరోనా ఉన్న వాటిల్లో 21 దేశాల్లో కేవలం ఒక్కో కేసు మాత్రమే నమోదైంది. మరో ఐదు దేశాల్లో గత 14 రోజుల నుంచి ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ఇది అంతం లేని పోరాటం కాదు. ఈ ప్రమాదాన్ని మనం తగ్గించగలం.. కానీ అది మనందరి సమష్టి కృషి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఇందుకు ప్రతి దేశం త్వరితంగా, కృత నిశ్చయంతో నడుచుకోవాలి. అప్రమత్తతే మన ఆయుధం. పరిహాసాలకు, నిస్పృహకు కారణాలు వెతికేందుకు ఇది సమయం కాదు’  అని గెబ్రెసస్‌ సూచించారు.

ఒంటరిగా ఉండిపోకండి
‘కరోనా భయం చుట్టుముట్టినప్పుడు ఒంటరిగా ఉండిపోకుండా, మీ చుట్టుపక్కల ఉన్నవారిని సంప్రదించండి. అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు మీ ప్రాంతంలో అమలవుతున్న ప్రణాళికలను తెలుసుకోండి. కరోనా విషయంలో మనకు తెలియనిది ఎంతో ఉంది. కానీ మనం రోజూ ఎంతో కొంత నేర్చుకుంటున్నాం.’ 

మన చేతుల్లోనే..
‘అయితే ఈ అనుకోని ప్రమాదం నుంచి బయటపడటానకి మనందరం సమైక్యంగా ఉండటం చాలా ముఖ్యం. ఈ ఇన్పెక్షన్ నుంచి వచ్చే ప్రమాదాన్ని తగ్గించటం అనేది మన చేతుల్లోనే ఉంది. ఎవరికైనా కరోనా వైరస్‌ సోకినట్లయితే దానిని ఇతరులకు సోకకుండా నివారించటం ద్వారా, మీ ప్రాంతంలో ఆపదలో ఉన్నవారికి సహాయపడటం ద్వారా అది సాధ్యమవుతుంది’  అని ‘‘బీ రెడీ ఫర్‌ కొవిడ్‌-19’’ సోషల్‌ మీడియా ఉద్యమం ద్వారా ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ పిలుపునిచ్చారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని