తాలిబన్‌ ఖైదీల విడుదలకు అఫ్గాన్‌ సుముఖత

తాజా వార్తలు

Published : 11/03/2020 11:12 IST

తాలిబన్‌ ఖైదీల విడుదలకు అఫ్గాన్‌ సుముఖత

క్రమంగా అమల్లోకి వస్తున్న అఫ్గాన్‌-తాలిబన్‌ ఒప్పందం!

కాబూల్‌: అఫ్గానిస్థాన్‌ ప్రభుత్వ చెరలో ఉన్న 5000 మంది తాలిబన్‌ బందీలను ఈ వారం నుంచి దశలవారీగా విడుదల చేస్తామని అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీ అధికార ప్రతినిధి వెల్లడించారు. దీంతో ఇరు వర్గాల మధ్య శాంతి ఒప్పందం ఖరారుపై నెలకొన్న ప్రతిష్టంభనకు ముగింపు పలకాలని భావిస్తున్నామన్నారు. అయితే తాలిబన్లు హింసాత్మక ఘటనలను మానుకొంటేనే ఇది అమలవుతుందని స్పష్టం చేశారు. దోహా ఒప్పందం మేరకు అఫ్గాన్‌లో ఉన్న తమ బలగాల్ని క్రమంగా ఉపసంహరించుకోవడం ప్రారంభించామని అమెరికా మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో అఫ్గాన్‌ నుంచి బందీల విడుదల నిర్ణయం వెలువడడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

‘‘అఫ్గాన్‌ ప్రభుత్వం శనివారం నుంచి మొదలుకొని తొలుత 1500 మంది తాలిబన్‌ బందీలను విడుదల చేస్తుంది. మరో 3,500 మందిని చర్చలు ప్రారంభమైన తర్వాత వదిలేస్తాం. ప్రతిరోజు 100 మందిని విడుదల చేయాలన్న ఒప్పందం నిబంధన అమలు తాలిబన్ల దాడులు తగ్గడంపై ఆధారపడి ఉంటుంది’’ అని అధికార ప్రతినిధి సేధిక్‌ సిద్ధిఖీ వెల్లడించారు. అప్గాన్‌ ప్రభుత్వం, తాలిబన్ల మధ్య నిలిచిపోయిన చర్చల్ని పునరుద్ధరించాలన్న లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి చర్చలు మంగళవారమే ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, దానికంటే ముందు 1000 మంది బందీలను విడుదల చేయాలని తాలిబన్లు షరతు విధించారు. దీంతో ఈ ప్రక్రియలో జాప్యం చోటుచేసుకుంది. అమెరికా ప్రతినిధి జాల్మే ఖలీల్‌జాద్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. వీలైనంత త్వరగా ఇరువర్గాలు దోహాలో భేటీ అయ్యి బందీల విడుదల అంశాన్ని పరిష్కరించుకోవాలని సూచించారు.

ఘనీ తాలిబన్‌ నేతలతో మాట్లాడడం ప్రారంభించారని.. త్వరలోనే చర్చల కోసం ఓ కమిటీని ఏర్పాటు చేసే అవకాశం ఉందని అమెరికా విదేశాంగశాఖ ఆశాభావం వ్యక్తం చేసింది. ఇక గత వారం అమెరికా, తాలిబన్ల మధ్య కుదిరిన శాంతి ఒప్పందానికి ఐరాస మద్దతు తెలిపింది. తదుపరి శాంతి చర్చల ప్రక్రియను ప్రారంభించాలని అఫ్గాన్‌ ప్రభుత్వానికి సూచించింది. ఈ ఒప్పందం ప్రకారం.. తాలిబన్‌ అన్ని షరతులకు కట్టుబడితే 14 నెలల్లో అమెరికా, దాని మిత్రపక్షాల బలగాలు అఫ్గాన్‌ నుంచి వైదొలుగుతాయి. ఒప్పందం కుదిరిన 135 రోజుల్లో అక్కడున్న మొత్తం 14 వేల మంది సైనికుల్లో 8600 మందిని అమెరికా వెనక్కి తీసుకుంటుంది. అదే నిష్పత్తిలో అమెరికా మిత్ర పక్షాలు కూడా తమ బలగాలను నాలుగు నెలల్లోగా ఉపసంహరించుకుంటాయి. తమ వద్ద బందీలుగా ఉన్న వారిని అమెరికా, తాలిబన్లు పరస్పరం మార్పిడి చేసుకుంటాయి. దాదాపు 5వేల మంది తాలిబన్‌ ఖైదీలు, అఫ్గాన్‌ సైన్యానికి చెందిన వెయ్యి మంది మార్చి 10 నాటికి విడుదల కావాల్సి ఉంది. అప్పటికల్లా అఫ్గాన్‌ ప్రభుత్వానికి, తాలిబన్‌కు మధ్య చర్చలు మొదలవ్వాలి. కానీ, విడుదల జాప్యం కావడంతో చర్చల ప్రక్రియ ఆలస్యం కానుంది. ఇందులో భాగంగా ఇప్పటికే అఫ్గాన్‌లోని వైమానిక స్థావరాల నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ ప్రారంభమైంది ఓ ఉన్నతాధికారి తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని