కరోనా వివరాలు దాచినందుకు వ్యక్తిపై కేసు

తాజా వార్తలు

Published : 16/03/2020 23:24 IST

కరోనా వివరాలు దాచినందుకు వ్యక్తిపై కేసు

ఆగ్రా: ప్రపంచ దేశాలను కుదిపేస్తున్న కరోనా (కొవిడ్-19) వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలకు ఉపక్రమించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా విదేశాల నుంచి వచ్చిన వారిని విమానాశ్రయం నుంచి ప్రత్యేక కేంద్రాలకు తరలిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం విదేశాల నుంచి వచ్చిన తన కుమార్తె వివరాలను దాచిపెట్టి వైద్య అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చినందుకు ఆగ్రాలో ఓ వ్యక్తిపై అక్కడి అధికారులు కేసు నమోదు చేశారు. అయితే పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆమెను ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

ఆగ్రాలోని కంటోన్మెంట్ రైల్వే కాలనీలో నివాసం ఉండే ఓ మహిళ తన భర్తతో కలిసి హనీమూన్‌ కోసం ఇటలీకి వెళ్లి వచ్చారు. ఆమె భర్తకు బెంగళూరులో పరీక్షలు నిర్వహించగా కరోనా సోకినట్లు నిర్థారణ అయ్యింది. అయితే సదరు మహిళ మాత్రం ఆగ్రాలో తల్లిదండ్రుల వద్దకు చేరుకొంది. ఆమెను పరీక్షించేందుకు వైద్యుల బృందం ఆగ్రాలో ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో ఆమె తండ్రి తన కుమార్తె ఇంట్లో లేదని, దిల్లీ నుంచి బెంగుళూరుకు వెళుతుందని అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చారు. కానీ ఆమె ఇంట్లో ఉందనే విషయాన్ని అధికారులు గుర్తించారు. దీంతో జిల్లా మేజిస్ట్రేట్ ప్రభు ఎన్‌ సింగ్ ఆదేశాల మేరకు అధికారులను తప్పుదోవ పట్టించింనందుకు, వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహిరించినందుకు ఆమె తండ్రిపై పలు సెక్షన్ల కింద సర్దార్‌ బజార్‌ పోలీస్‌స్టేషన్లో కేసు నమోదు చేశారు.

దీని గురించి అదనపు ప్రధాన వైద్య అధికారి డాక్టర్‌ వినయ్‌ కుమార్‌ మాట్లాడుతూ ‘‘మొత్తం 12 రక్త నమూనాలను పరీక్షల కోసం అలీఘర్‌ ముస్లిం యూనివర్శిటీ పరిధిలోని జవహర్‌లాల్ నెహ్రూ వైద్య కళాశాలకు పంపించాం. అందులో 11 నమూనాలు కరోనా నెగటివ్‌ రాగా ఒక మహిళ రక్త నమూనాలో మాత్రం కరోనా అనుమానిత లక్షణాలు కనిపించాయి. దీంతో పరీక్షించేందుకు ఇంటికి వెళ్లగా ఆమె తండ్రి తన కుమార్తె ఇంటో లేదని అబద్ధం చెప్పాడు. తర్వాత అధికారులు ఆమె ఇంట్లో ఉన్న విషయాన్ని తెలుకొని పరీక్షలు నిర్వహించి రక్త నమూనాలను నిర్థారణ కోసం కింగ్ జార్జి వైద్య విశ్వవిద్యాలయానికి పంపగా ఆమెకు కరోనా సోకినట్లు నిర్థారణ అయ్యింది. దీంతో ఆమెను ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నాం’’ అని తెలిపారు.

ఇదీ చదవండి...

కరోనా వ్యాక్సిన్‌ హస్తగతానికి ట్రంప్‌ కుట్ర...?


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని