నాగ్‌పూర్‌లో 144 సెక్షన్‌

తాజా వార్తలు

Updated : 17/03/2020 08:57 IST

నాగ్‌పూర్‌లో 144 సెక్షన్‌

నాగ్‌పూర్‌: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ దేశంలోనూ తన పంజా విసురుతోంది. మహారాష్ట్రలో అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఒక్క ముంబయిలోనే 14 మందికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో 39 మంది కరోనా బారిన పడ్డట్లు ధ్రువీకరించారు. వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రధాన నగరమైన నాగ్‌పూర్‌లో 144 సెక్షన్‌ విధించారు. ఎలాంటి సామాజిక, రాజకీయ, సాంస్కృతిక సమావేశాలు నిర్వహించొద్దని నగర పోలీస్‌ జాయింట్‌ కమిషనర్‌ రవీంద్ర కందం కోరారు. ర్యాలీలు, నిరసన ప్రదర్శనలకు కూడా అనుమతి లేదని తెలిపారు. అంతకుముందు ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ పట్టణాన్నీ పూర్తి నిర్బంధంలో ఉంచే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ప్రజలు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. దేవాలయాలు, చర్చిలు, మసీదులకు గుంపులుగా వెళ్లడం ఆపేయాలని సూచించారు. రానున్న 15 నుంచి 20 రోజులు చాలా కీలకమని వైరస్‌ వ్యాప్తిని అరికట్టాలంటే ప్రజలు ప్రభుత్వంతో సహకరించాలని కోరారు. ఇప్పటి వరకు రైళ్లు బస్సులను నిలిపివేయాలన్న నిర్ణయం తీసుకోలేదని.. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు ఆంక్షల్ని సమీక్షిస్తామని తెలిపారు. ఇప్పటికే ఆ రాష్ట్రంలో అన్ని రకాల పరీక్షల్ని వాయిదా వేసిన విషయం తెలిసిందే.     

భారత్‌లో రెండో దశలో ఉన్న కరోనా వైరస్‌ వ్యాప్తిని ఇక్కడే కట్టడి చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. మూడో దశ అయిన సమూహ వ్యాప్తి స్థాయికి చేరితే చైనా, ఇటలీ, ఇరాన్‌ తరహాలో తీవ్ర ఇక్కట్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే విద్యాసంస్థలు, సినిమా థియేటర్లు, దుకాణ సముదాయాలు, క్రీడా పోటీలు, భారీ సభల్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించాయి. అత్యవసరమైతే తప్ప దూర ప్రయాణాలు పెట్టుకోవద్దని సూచిస్తున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని