49 ఏళ్లలో తొలిసారి.. ‘తాజ్‌’ ఇలా..!

తాజా వార్తలు

Published : 17/03/2020 21:23 IST

49 ఏళ్లలో తొలిసారి.. ‘తాజ్‌’ ఇలా..!

ఆగ్రా: కరోనా వైరస్‌ భారత్‌లోని పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ వైరస్‌ దెబ్బకు ఏటా లక్షలాది మంది దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించే పర్యాటక ప్రదేశాలు బోసిపోతున్నాయి. తాజాగా ఆగ్రాలోని చారిత్రక పాలరాతి కట్టడం తాజ్‌మహల్‌కు 15 రోజుల పాటు పర్యాటకుల ప్రవేశాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అన్ని చారిత్రక కట్టడాలు, మ్యూజియంలను ఈ నెల 31 వరకు మూసివేయాలని భారత పురావస్తు శాఖ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో 49 ఏళ్ల తర్వాత తొలిసారి తాజ్‌మహల్‌ను మూసివేశారని ఆగ్రాలో ఎంతో కాలంగా నివాసం ఉంటున్న వారు పేర్కొంటున్నారు. ఇన్ని రోజుల పాటు గతంలో రెండు సార్లు మాత్రమే తాజ్‌ను మూసివేశారని చెబుతున్నారు.

1971 పాకిస్థాన్‌తో యుద్ధం సమయంలో 15 రోజులు, ఆ తర్వాత 1978లో వరదలు వచ్చినప్పుడు ఏడు రోజుల పాటు తాజ్‌ మూతపడిందని చెబుతున్నారు. తాజాగా కరోనా విజృంభణ నేపథ్యంలో తాజ్‌ అందాలను వీక్షించే అవకాశాన్ని 15 రోజుల పాటు సందర్శకులకు తాత్కాలికంగా నిలిపివేశారు. కానీ ఈసారి కేవలం తాజ్‌ ఒక్కటే కాదు.. ఆగ్రాలోని ఇతర చారిత్రక కట్టడాలను కూడా మూసివేశారని ఆగ్రాకు చెందిన ఉమాశంకర్‌ అనే వ్యక్తి తెలిపారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ మరణించిన సమయంలో 1984లో కూడా ఒక రోజు పాటు తాజ్‌ను మూసివేసినట్టు ఆయన చెప్పారు.  ఆగ్రాలో ఇప్పటివరకు ఏడు కరోనా కేసులు నమోదైన విషయం తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని