ఎన్ఆర్‌ఐలూ జాగ్రత్త..!
close

తాజా వార్తలు

Published : 20/03/2020 00:45 IST

ఎన్ఆర్‌ఐలూ జాగ్రత్త..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్‌ ప్రభావంతో ప్రపంచదేశాలు విలవిలలాడుతున్నాయి. ఇప్పటికే కొవిడ్‌-19తో విశ్వవ్యాప్తంగా 8వేల మంది మరణించగా.. మరో 2 లక్షల మంది ఈ మహమ్మారి బారిన పడ్డట్లు నివేదికలు స్పష్టంచేస్తున్నాయి. ఇదిలా ఉంటే, భారత్‌లో కూడా కరోనా వైరస్‌ తీవ్రతను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పకడ్బందీ చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చైనాలో కరోనా వైరస్‌ కేసులు తగ్గుముఖం పట్టగా చైనా వెలుపలే అత్యధిక కేసులు నమోదవుతున్నాయి.

ముఖ్యంగా ఇటలీ, ఇరాన్‌, స్పెయిన్‌, జర్మనీ దేశాల్లో దీని తీవ్రత అధికంగా ఉంది. అయితే కేవలం ఈ నాలుగు దేశాల్లో భారతీయులు (ఎన్‌ఆర్‌ఐ) ఎక్కువగా ఉండటం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తోంది. ఈ నాలుగు దేశాల్లో దాదాపు 3లక్షల మంది ప్రవాసభారతీయులు ఉన్నట్లు అంచనా. దీంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల గురించి ఆందోళన వ్యక్తం అవుతోంది. దీనికి కారణం భారతీయులు ఎక్కువగా ఉండే దేశాల్లో కరోనా వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉండటమే. విదేశాల్లో ఉన్న 276మంది భారతీయులకు కరోనా సోకిందని తాజాగా కేంద్రప్రభుత్వం వెల్లడించిన విషయం తెలిసిందే. కేవలం ఒక్క ఇరాన్‌లోనే 255 భారతీయులకు కరోనా నిర్ధారణ కావడం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. 

ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా విదేశాలకు వలసవెళ్లి నివసిస్తున్న వారిలో భారతీయుల సంఖ్య కూడా అధికంగా ఉంది. ఇలా ప్రపంచవ్యాప్తంగా దాదాపు కోటీ 75 లక్షల మంది నివసిస్తున్నట్లు సమాచారం. ఇది ప్రపంచదేశాల్లో వలస వెలుతున్న వారిలో 6 శాతం కావడం విశేషం. అయితే భారత విదేశాంగశాఖ లెక్కల ప్రకారం.. భారత పాస్‌పోర్టు కలిగిన కోటీ ముప్పైలక్షల మంది విదేశాల్లో నివసిస్తున్నారు. మరో కోటీ ఎనభైలక్షల మంది భారతీయ మూలాలుండి విదేశాల్లో స్థిరపడ్డవారు ఉన్నట్లు సమాచారం. అయితే, ప్రపంచవ్యాప్తంగా వణికిస్తున్న కరోనా వైరస్‌ ప్రభావంతో అప్రమత్తమైన భారతీయులు ఇప్పటికే స్వదేశానికి చేరుకోడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సమయంలో కొందరు భారత్‌ చేరుకోగా.. అంతర్జాతీయ విమానాల ఆంక్షల నేపథ్యంలో చాలా మంది అక్కడే ఉండిపోయిన పరిస్థితి కనిపిస్తోంది.  

ఇలా ప్రపంచవ్యాప్తంగా ప్రవాసభారతీయుల వివరాల్లోకెళ్తే.. కేవలం అమెరికాలోనే 13లక్షల మంది భారతీయులు ఉండగా.. యూకేలో  మూడులక్షలు, ఇటలీలో లక్షా70వేల భారతీయులు నివసిస్తున్నారు. ఇలా చైనాతో పాటు కరోనా వైరస్‌ తీవ్రత అత్యధికంగా ఉన్న 10 దేశాల్లో భారతీయుల సంఖ్య 20 లక్షలు ఉంది. ఈ సమయంలో భారత విదేశాంగశాఖ కరోనా ప్రభావం ఉన్న అన్ని దేశాలతో సంప్రదింపులు జరుపుతోంది. అక్కడ నివసించే భారతీయుల పరిస్థితులను ఆరా తీయడంతోపాటు అత్యవసర పరిస్థితుల్లో వారిని భారత్‌ తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఏదేమైనా విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని