కరోనా మృతి: అంత్యక్రియలకు నిరాకరణ!

తాజా వార్తలు

Published : 24/03/2020 20:55 IST

కరోనా మృతి: అంత్యక్రియలకు నిరాకరణ!

కోల్‌కతా: కరోనా వైరస్‌ కారణంగా మరణించిన వారి అంత్యక్రియలు చేయడానికి కుటుంబ సభ్యులే నిరాకరిస్తున్న హృదయ విదారక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా మరణాల సంఖ్య పదికి చేరింది. ఈ సమయంలో ఈ వైరస్‌తో మృతిచెందిని వారికి అంత్యక్రియలు నిర్వహించడం సవాల్‌గా మారింది. పశ్చిమబెంగాల్‌కు చెందిన 57ఏళ్ల వ్యక్తికి ఎటువంటి విదేశీ ప్రయాణ చరిత్ర లేదు. అయినప్పటికీ కరోనా లక్షణాలు కనిపించడంతో మార్చి 19న ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు నిర్వహించగా కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. నాలుగురోజుల చికిత్స అనంతరం సోమవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ విషయాన్ని ఆ వ్యక్తి కుటుంబ సభ్యులతోపాటు జిల్లా అధికారులకు తెలియజేశారు. 

ఈ వార్త వినగానే ఆ వ్యక్తి నివసించే ఉత్తర 24పరగణాల జిల్లాలోని డమ్‌డమ్‌ ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అప్పటికే కుటుంబసభ్యులను ప్రత్యేక పరిశీలనలో ఉంచగా..ఆసుపత్రి నుంచి మృతిదేహాన్ని తీసుకెళ్లేందుకు బంధువులు ముందుకు రాలేదు. వైరస్‌ తమకు సోకుతుందనే భయంతో ఆసుపత్రికి రావడానికి కూడా నిరాకరించారు. ఈ సమయంలో మృతిచెందిన వ్యక్తి భార్య, కుటుంబసభ్యులు ఐసోలేషన్‌లో ఉన్నందున వారు కూడా అంత్యక్రియలకు దూరమయ్యారు. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ నియమాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆసుపత్రి అధికారులకు సూచించింది. నిబంధనల ప్రకారం కుటుంబంలోని ఒక వ్యక్తి సంతకం సరిపోతుంది. ఇందుకోసం ఐసోలేషన్‌లో ఉన్న అతని భార్యకు విషయం తెలియజేసిన అధికారులు ఆమె సంతకాన్ని తీసుకున్నారు. ఈ సమయంలో స్థానిక స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించేందుకు స్థానికులు కూడా నిరాకరించారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసిన అనంతరం అంత్యక్రియలు నిర్వహించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, కరోనా సోకిన వ్యక్తికి చికిత్స చేసిన ఏఎంఆర్‌ఐ ఆసుపత్రి డాక్టర్లు, వైద్య సిబ్బందిని హోం క్వారంటైన్‌ కావాలని అధికారులు సూచించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని