వలసకార్మికుల స్థితిపై నివేదిక కోరిన సుప్రీం

తాజా వార్తలు

Published : 30/03/2020 15:57 IST

వలసకార్మికుల స్థితిపై నివేదిక కోరిన సుప్రీం

దిల్లీ: లాక్‌డౌన్‌ నేపథ్యంలో స్వస్థలాలకు భారీగా తరలివెళ్తున్న వలసకార్మికుల విషయంలో తీసుకుంటున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. మంగళవారానికి రిపోర్టు సమర్పించాలని స్పష్టం చేసింది. కరోనా వైరస్‌ కంటే కార్మికుల వలసే పెద్ద సమస్యగా పరిణమిస్తోందని విచారణ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. అయితే, ఈ విషయంలో ప్రభుత్వానికి మార్గదర్శకాలు జారీ చేయాలన్న పిటిషనర్ల విజ్ఞప్తిని మాత్రం కోర్టు తోసిపుచ్చింది. ఇప్పటికే చర్యలు చేపట్టిన కేంద్రానికి ఈ తరుణంలో మార్గదర్శకాలు జారీ చేసి మరింత గందరగోళం సృష్టించే ఉద్దేశం లేదని అభిప్రాయపడింది. 

వలస కార్మికుల విషయంలో కేంద్రానికి మార్గదర్శకాలు జారీ చేయాలని న్యాయవాదులు అలోక్‌ శ్రీవాస్తవ, రష్మీ భన్సల్‌ వేరు వేరుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను దాఖలు చేశారు. దీనిపై నేడు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఏ.బోబ్డే, జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వర రావుతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. కరోనా వ్యాప్తి కట్టడి చర్యలు అమలులో ఉన్న నేపథ్యంలో ప్రత్యక్ష వాదనలకు స్వస్తి పలికిన సుప్రీం.. నేడు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వాదనలు ఆలకించింది. మార్గదర్శకాలు జారీ చేయడానికి ముందు కేంద్ర నివేదిక కోసం వేచి చూస్తామని స్పష్టం చేసింది. కేంద్రం తరఫున వాదనలు వినిపించిన సోలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా.. కార్మికుల వలసని పూర్తిగా నిలిపివేయాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అవసరమైన చర్యలు తీసుకుంటున్నాయని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీనిపై తదుపరి విచారణను కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది.

ఇవీ చదవండి...

సరిహద్దులు బంద్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని