యువకులూ బలవుతున్నారు..!
close

తాజా వార్తలు

Published : 01/04/2020 13:11 IST

యువకులూ బలవుతున్నారు..!

బ్రిటన్‌లో 13 ఏళ్ల బాలుడు మృతి

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా వైరస్‌కు యువకులు అతీతం ఏం కాదన్న ఐరాస హెచ్చరికలు నిజమవుతున్నాయి. పలు దేశాల్లో యువకులు మృతిచెందిన ఘటనలు నమోదవుతున్నాయి. తాజాగా బ్రిటన్‌లో 13 ఏళ్ల బాలుణ్ని కరోనా మహమ్మారి బలిగొంది. అతనికి గతంలో ఎటువంటి అనారోగ్యం కూడా లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. మరోవైపు మంగళవారం ఉదయం బెల్జియంలో 12 ఏళ్ల బాలిక మృత్యువాతపడింది. అంతకుముందు ఫ్రాన్స్‌లో 18 ఏళ్ల యువకుడు మృతిచెందాడు. ఈ పరిణామాలతో యువకులనూ ఈ మహమ్మారి ఆస్పత్రి పాల్జేస్తున్న నిజం నిరూపితమవుతోంది. బ్రిటన్‌లో 24 గంటల్లో 381 మంది మృతిచెందినట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఆ దేశంలో మహమ్మారి వెలుగులోకి వచ్చిన నాటి నుంచి ఒక్కరోజులో మృతుల సంఖ్య ఇదే అత్యధికం. దీంతో ఇప్పటి వరకు వైరస్‌ బారినపడి మరణించిన వారి సంఖ్య 1,789కు పెరిగింది. 

* ఇటలీలో కరోనా మృత్యుఘోష ఇంకా కొనసాగుతూనే ఉంది. 24 గంటల్లో 837 మంది మృతిచెందినట్లు అక్కడి అధికారులు మంగళవారం సాయంత్రం తెలిపారు. దీంతో మృత్యుల సంఖ్య 12,428కి పెరిగింది. కొత్తగా మరో 2,107 మంది వైరస్‌ బారినపడడంతో బాధితుల సంఖ్య 1,05,792కు చేరింది. చనిపోయిన వారికి సంతాపం ప్రకటిస్తూ దేశవ్యాప్తంగా నిన్న ఒక నిమిషం పాటు మౌనం పాటించారు. 

* ఫ్రాన్స్‌లోనూ మృతుల సంఖ్య రోజురోజుకీ రికార్డు స్థాయిలో పెరుగుతోంది. 24 గంటల్లో 499 మంది మరణించారని ఫ్రాన్స్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఒక్కరోజులో ఇంతమంది మరణించడం ఇదే తొలిసారి. దీంతో అక్కడ మృతుల సంఖ్య 3,523కు చేరింది. అయితే ఇది కేవలం ఆస్పత్రుల్లో మరణించిన వారి సంఖ్య మాత్రమేనని.. వృద్ధాశ్రమాలు, ఇళ్లలో ప్రాణాలు కోల్పోతున్న వారిని కూడా పరిగణనలోకి తీసుకుంటే ఆ సంఖ్య మరింత భారీ స్థాయిలో ఉంటుందని అధికారులే చెబుతుండడం గమనార్హం. ఫ్రాన్స్‌లో ఇప్పటి వరకు 52,128 మందికి వైరస్‌ సోకినట్లు గుర్తించారు. 

* స్పెయిన్‌లో బాధితుల సంఖ్య లక్షకు చేరువైంది. మంగళవారం 849 మంది మరణించడంతో అక్కడ మృతుల సంఖ్య 8,189కు చేరింది. ఇక బాధితుల సంఖ్య ఒక్కరోజులో 11 శాతం పెరిగింది. వ్యాప్తి తీవ్రత క్రమంగా తగ్గుతోందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఒక్క మ్యాడ్రిడ్‌ ప్రాంతంలోనే దాదాపు 3,609 మంది మృత్యువాత పడడం ఆందోళన కలిగిస్తోంది. 

* చైనాలో వైరస్‌ తీవ్రత తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడు అక్కడి ప్రభుత్వం లక్షణాలు లేకుండా వైరస్‌ బారిన పడే అవకాశం ఉన్న వ్యక్తులపై దృష్టి సారించింది. ప్రజల్లో భయాలు తొలగించడం కోసమే ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. లక్షణాలు బయటకు కనిపించనప్పటికీ.. కొందరిలో వైరస్ ఇంకా ఉండే అవకాశం ఉందన్న భయాందోళనల మధ్య ప్రజలు రోజువారీ కార్యకలాపాల్లో పాల్గొనడానికి సంకోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. చైనాలో ఇప్పటి వరకు 81,518 మందికి వైరస్‌ సోకినట్లు గుర్తించారు. వీరిలో 76,052 మంది కోలుకున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. మరో 3,305 మంది మృత్యువాతపడ్డారు. 

* సింగపూర్‌లో మంగళవారం కొత్తగా 47 కేసులను గుర్తించారు. వీరిలో ఇద్దరు భారతీయులు ఉన్నారు. ఆ దేశంలో ఇప్పటి వరకు 926 మంది వైరస్‌ బారిన పడ్డారు. వీరిలో ముగ్గురు మరణించగా.. 240 మంది కోలుకున్నారు.

ఇవీ చదవండి..

ఏపీలో ఒక్క రోజే 43 కరోనా కేసులు
గడ్డు పరిస్థితులకు సిద్ధంగా ఉండండి: ట్రంప్‌

పెను సంక్షోభం ఎదుర్కోబోతున్నాం: ఐరాస


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని