కరోనా: ఆశాజనకంగా ప్లాస్మా థెరపి

తాజా వార్తలు

Updated : 07/04/2020 19:06 IST

కరోనా: ఆశాజనకంగా ప్లాస్మా థెరపి

దక్షిణ కొరియాలో కోలుకున్న ఇద్దరు వృద్ధులు

సియోల్‌: దక్షిణ కొరియాలో ఇద్దరు వృద్ధులు ‘ప్లాస్మా థెరపి’తో కరోనా వైరస్‌ నుంచి విముక్తి పొందారు. కొవిడ్‌-19 నుంచి కోలుకున్న వారి ప్లాస్మాతో చికిత్స చేయగా తీవ్రమైన న్యూమోనియా లక్షణాల నుంచి వీరు బయటపడ్డారని పరిశోధకులు తెలియజేశారు. ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారిని ఎదుర్కోవడానికి ‘ప్లాస్మా థెరపి’ ఆశాజనకంగా కనిపిస్తోందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

రక్తంలో కలిసుండే జిగురులాంటి పారదర్శక పదార్థమే ప్లాస్మా. కరోనా వైరస్‌ సోకి కోలుకున్నవారిలో యాంటీ బాడీస్‌ తయారవుతాయి. వాటిని ఉపయోగించే తాము చికిత్స చేశామని పరిశోధకులు తెలిపారు. ‘యాంటీ వైరల్‌ మందులకు స్పందించని క్రిటికల్‌ కేర్‌లో ఉన్న రోగులకు ప్లాస్మా థెరపి ప్రత్యామ్నాయ చికిత్సా పద్ధతిగా మారగలదు’ అని సియోల్‌లోని సెవెరన్స్‌ ఆస్పత్రి వైద్యుడు, పరిశోధకుడు చోయి జాన్‌యాంగ్‌ అన్నారు. అయితే భారీ సంఖ్యలో రోగులపై క్లినికల్‌ ట్రయల్స్‌ చేసి దీని ప్రభావాన్ని గుర్తించాల్సి ఉందని పేర్కొన్నారు.

ప్లాస్మా థెరపి ద్వారా కోలుకున్న ఇద్దరు బాధితుల్లో ఒకరి వయసు 71. క్రిటికల్‌ కేర్‌లో ఉన్న ఆ వ్యక్తిలో ఎలాంటి స్పందనా లేదు. 20 ఏళ్ల వ్యక్తి ప్లాస్మాతో పాటు స్టెరాయిడ్స్‌ అందించి చికిత్స చేశారు. మొదట ఆయనకు మలేరియా, న్యూమోనియా మందులు ఇచ్చారు. ఇక మరో బాధితురాలి వయసు 67. మలేరియా, హెచ్‌ఐవీ మందులు, ఆక్సీజన్‌ థెరపికి మొదట ఆమె స్పందించలేదు. ప్లాస్మా థెరపీతో పాటు స్టెరాయిడ్స్‌కు ఆమె కోలుకుంది.

పరిశోధనా వివరాలను కొరియన్‌ మెడిసిన్‌ జర్నల్‌లో ప్రచురించారు. వైరస్‌కు ఎలాంటి వాక్సిన్‌ అందుబాటులో లేనప్పుడు ప్లాస్మా థెరపి కీలకమని సియోల్‌ సెంట్రల్‌ డిసీజ్‌ కంట్రోల్‌ హెడ్‌క్వార్టర్స్‌ అధికారి క్వాన్‌ జున్‌ వుక్‌ అన్నారు. ఈ రెండు కేసులను నిపుణులు త్వరగా పరిశీలించాలని ఆయన కోరారు. ప్లాస్మా, ఇతర చికిత్సలపై త్వరగా పరిశోధనలు చేయాలని పేర్కొన్నారు. ఎబోలా, సార్స్‌, సంక్రమణ వ్యాధుల చికిత్సలో ప్లాస్మా ప్రభావంపై చిన్న చిన్న అధ్యయనాలు జరిగాయి. ఫ్రాన్స్‌లోని ప్యారిస్‌ ఆస్పత్రిలో మంగళవారం 60 మంది బాధితులపై ప్లాస్మా థెరపి ట్రయల్స్‌ ఆరంభమయ్యాయి. దక్షిణ కొరియాలో ‘కనుక్కోవడం, పరీక్షించడం, చికిత్స చేయడం’ పద్ధతి ద్వారా కరోనాను విజయవంతంగా నియంత్రించిన సంగతి తెలిసిందే.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని