‘ప్లాస్మా థెరపీ’తో కోలుకుంటున్న సంకేతాలు

తాజా వార్తలు

Updated : 13/04/2020 11:39 IST

‘ప్లాస్మా థెరపీ’తో కోలుకుంటున్న సంకేతాలు

ముగ్గురు భారత అమెరికన్లపై హ్యూస్టన్‌ వైద్యుల పరిశీలన

హ్యూస్టన్‌ : కరోనా వైరస్‌తో బాధపడుతూ తమ ఆస్పత్రిలో చేరిన ముగ్గురు భారత అమెరికన్లు ‘ప్లాస్మా థెరపీతో’ కోలుకుంటున్న సంకేతాలు కనపడ్డాయని హ్యూస్టన్‌లోని సెంట్‌ లూక్స్‌ మెడికల్‌ సెంటర్‌ వైద్యులు ఆదివారం వెల్లడించారు. కరోనా వైరస్‌కు ప్రస్తుతం వ్యాక్సిన్‌ లేని కారణంగా అమెరికాలోని పలు ఆస్పత్రుల్లో ‘ప్లాస్మా ట్రాన్స్‌ఫ్యూజన్‌’ పాత పద్ధతిని అవలంభిచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ చికిత్సతో కరోనా పేషంట్లు పూర్తిగా కోలుకుంటారన్న భరోసా లేకపోయినా ప్రయత్నాలు మాత్రం చేస్తున్నారు. 

హ్యూస్టన్‌లో నివసిస్తున్న ముగ్గురు భారత అమెరికన్లు రోహన్‌ బవడేకర్‌, డా.లవంగ వెలుస్వామి, సుష్మ్‌ సింగ్‌ వైరస్‌ బారిన పడి సెంట్‌లూక్స్‌ ఆస్పత్రిలో చేరారు. వారి పరిస్థితి విషమించడంతో వైద్యులు ‘ప్లాస్మా ట్రాన్స్‌ఫ్యూజన్‌ పద్ధతి’ అవలంభించారు. ఈ విధానంతో వారు కోలుకుంటున్న సంకేతాలు కనపడ్డాయని ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ప్లాస్మా థెరపీ అంటే.. ఇప్పటికే కరోనా సోకి పూర్తిగా కోలుకున్న వ్యక్తుల రక్తం నుంచి ప్లాస్మా సేకరించి అందులోని యాంటీబాడీలను సదరు పేషంట్లకు ఎక్కిస్తారు. తద్వారా కరోనా చికిత్స పొందుతున్న వారి రక్తంలో యాంటీబాడీలు ప్రవేశించి వైరస్‌ను నియంత్రిస్తాయి. 

కరోనా వ్యాక్సిన్‌ తయారీకి ఏడాదికిపైగా సమయం పట్టే అవకాశం ఉన్నందున.. ప్రస్తుత పేషంట్లను కాపాడేందుకు ఈ విధానం అమలు చేస్తున్నట్లు అక్కడి వైద్య పరిశోధకుడు లోలా అడెపోజు చెప్పారు. గతంలోనూ పలు వైరస్‌లకు ఈ విధానాన్ని అమలుచేశారని, తద్వారా మంచి ఫలితాలు వచ్చాయన్నారు. అందుకే ఇప్పుడు కూడా అదే పద్ధతిని కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నమాని తెలిపారు. కాగా, ఈ చికిత్సకు అమెరికాలోని ‘ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌’ ఇంకా ఆమోదం తెలపకపోయినా క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించడానికి అనుమతించింది. దీంతో హ్యూస్టన్‌ మెడికల్‌ సెంటర్‌తో పాటు దేశంలోని పలు ఆస్పత్రుల్లో అత్యంత విషమ పరిస్థితి ఎదుర్కొంటున్నవారికి ఈ ‘ప్లాస్మా ట్రాన్స్‌ఫ్యూజన్‌’ చికిత్స అందిస్తున్నారు. 

ఇవి చదవండి: 

అప్పుడే హెచ్చరించారు..

జీవితాంతం వారికి రుణపడి ఉంటా: బోరిస్‌


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని