ఇండోర్‌, ధారావిల్లో కరోనా విజృంభణ!

తాజా వార్తలు

Published : 16/04/2020 01:06 IST

ఇండోర్‌, ధారావిల్లో కరోనా విజృంభణ!

దిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, రాజస్థాన్‌లలో కొవిడ్‌-19 తీవ్రత అధికంగా ఉంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 11వేలు దాటగా 377మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఆయా రాష్ట్రాల్లో నమోదవుతున్న కరోనా కేసులు, మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది.

ధారావిలో పెరుగుతున్న కరోనా కేసులు..

కరోనా వైరస్‌ మహమ్మారి మహారాష్ట్రపై విరుచుకుపడుతోంది. దేశంలోనే అత్యధిక కరోనా పాజిటివ్‌ కేసులు మహారాష్ట్రలోనే నమోదవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రాష్ట్రంలో 2700పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 178 మంది మృత్యువాతపడ్డారు. ముంబయిలో ఈ వైరస్‌ తీవ్రత అధికంగా ఉంది. తాజాగా అతిపెద్ద మురికివాడ ప్రాంతమైన ధారావిలో కరోనా కేసుల సంఖ్య 60కి చేరగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.

10మంది వైద్య సిబ్బందికి కరోనా..

ఇంతటి ఆపత్కాలంలో వైద్యసేవలు అందిస్తోన్న డాక్టర్లు, వైద్య సిబ్బందికి కరోనా సోకుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ముంబయిలోని ఓ ఆసుపత్రిలో కరోనా సోకిన వారికి చికిత్స చేస్తున్న 10మంది వైద్య సిబ్బందికి కొవిడ్‌-19 నిర్ధారణ అయినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఇప్పటివరకు ఆ ఆసుపత్రిలో 35మందికి కరోనా సోకిందని తెలిపారు. వారందరికీ ప్రత్యేక వార్డుల్లో చికిత్స అందిస్తున్నారు. 

రాజస్థాన్‌లో వేయి దాటిన కేసులు..

రాజస్థాన్‌లో కొవిడ్‌-19 తీవ్రత గత వారంరోజుల్లో ఒక్కసారిగా పెరిగింది. తాజాగా బుధవారం మధ్యాహ్నం సమయానికే కొత్తగా 55పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1034కి చేరిందని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ వైరస్‌ సోకి ఇప్పటివరకు 11మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. జైపూర్‌, జోధ్‌పూర్‌, కోటా ప్రాంతాల్లో వైరస్‌ తీవ్రత అధికంగా ఉందని రాష్ట్ర అదనపు ముఖ్యకార్యదర్శి రోహిత్‌ కుమార్‌ వెల్లడించారు. అత్యధికంగా జైపూర్‌లో 468మంది కరోనా బారినపడ్డారు. రాష్ట్రంలో కరోనా సోకిన బాధితుల్లో ఇద్దరు ఇటాలియన్లు కాగా మరో 54మంది ఇరాన్‌ నుంచి తీసుకువచ్చిన వారేనని తెలిపారు. 

ఇండోర్‌లో మరణాల శాతం 6.8..

మధ్యప్రదేశ్‌లో కూడా కరోనా తీవత్ర కొనసాగుతోంది. రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు 800కేసులు నమోదుకాగా 50మంది ప్రాణాలు కోల్పోయారు. కేవలం ఇండోర్‌లోనే 544పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. బుధవారం ఒక్కరోజే నగరంలో 117 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. ఈ నగరంలోనే కరోనా సోకి 37మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేశారు. దేశవ్యాప్తంగా కరోనా మరణాల రేటు దాదాపు మూడుశాతం ఉంటే ఇండోర్‌లో మాత్రం 6.8శాతంగా ఉంది. అయితే కరోనా తీవత్ర ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ అన్నారు.

ఇవీ చదవండి..

స్వీయ నిర్బంధంలోకి గుజరాత్‌ ముఖ్యమంత్రి..

భారత్‌లో 377 మరణాలు, 11,439 కేసులు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని