కరోనా ఎఫెక్ట్‌: భారత్‌కు యునిసెఫ్‌ హెచ్చరిక

తాజా వార్తలు

Published : 08/05/2020 02:12 IST

కరోనా ఎఫెక్ట్‌: భారత్‌కు యునిసెఫ్‌ హెచ్చరిక

దిల్లీ: భారత్‌లో గర్భిణులు, పుట్టబోయే శిశువులకు రానున్న కాలం మరింత కఠినం కానుందని ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యునిసెఫ్‌ హెచ్చరించింది. మే 10న అంతర్జాతీయ మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని ఓ ప్రకటనను విడుదల చేసింది. రానున్న తొమ్మిది నెలల కాలంలో భారత్‌లో సుమారు రెండు కోట్లకు పైగా శిశువులు జన్మించనున్నట్టు సంస్థ అంచనా వేసింది. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఈ తల్లీ బిడ్డలకు ఆరోగ్యపరమైన ప్రమాదాలు పొంచి ఉన్నట్టు యునిసెఫ్‌ తెలిపింది. 

ప్రపంచ వ్యాప్తంగా మార్చి నుంచి డిసెంబర్‌ మధ్య జన్మించే 115 మిలియన్ల శిశువులపై, వారి తల్లులపై కూడా కొవిడ్-19 ప్రభావం ఉంటుందని, భారత్‌లో అత్యధికంగా ఉండనుందని యునిసెఫ్‌ తెలిపింది. ఆ తర్వాతి స్థానాల్లో చైనా, నైజీరియా, పాకిస్థాన్‌, ఇండోనేషియాలు ఉన్నాయి. సాధారణంగానే ఆయా దేశాల్లో నవజాత శిశు మరణాల రేటు అధికమని, కరోనా నేపథ్యంలో ఈ రేటు మరింత ఎక్కువ కాగలదని యునిసెఫ్‌ అంచనా వేసింది. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలకు కూడా ఈ ప్రమాదం ఉందని సంస్థ స్పష్టంచేసింది.

తల్లీబిడ్డల ప్రాణాలకు ముప్పు

ఇన్ఫెక్షన్లు సోకుతాయనే భయంతో గర్భిణులు ఆస్పత్రులకు వెళ్లటానికే భయపడుతున్నారని సంస్థ డైరక్టర్‌ హెన్రిట్టా ఫోర్‌ తెలిపారు. లాక్‌డౌన్లు, కర్ఫ్యూల వంటి కొవిడ్ నివారణ చర్యలు తల్లీబిడ్డల ప్రాణాలకు ముప్పు తేగలవని ఆమె అన్నారు. గర్భధారణ, ప్రసవం, జననానంతర సమయాల్లో అవసరమయ్యే అత్యవసర సేవలకు ఈ చర్యలు ఆటంకం కలిగిస్తాయని ఆమె వివరించారు. తల్లి నుంచి బిడ్డకు కరోనా సోకే విషయంలో కచ్చితమైన సమాచారం లేనప్పటికీ, కాబోయే తల్లులు తమకు కరోనా సోకకుండా జాగ్రత్త పడటం అవసరమని యునిసెఫ్‌కు చెందిన నిపుణులు తెలిపారు. కరోనా కేసులతో కిక్కిరిసిన ఆరోగ్య కేంద్రాలు, ఔషధాలు, వైద్య పరికరాలు, నిపుణుల కొరత వంటి పరిస్థితులను ఎదుర్కోవటానికి ప్రభుత్వాలు సిద్ధంగా ఉండాలని వారు విజ్ఞప్తి చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని