భారత్‌లో 24గంటల్లో 103మరణాలు

తాజా వార్తలు

Updated : 08/05/2020 10:42 IST

భారత్‌లో 24గంటల్లో 103మరణాలు

దిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి రోజురోజుకు ఉగ్రరూపం దాలుస్తోంది. గత కొన్నిరోజులుగా దేశంలో సరాసరి రోజుకు మూడువేల కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 3390 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా 103 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య శుక్రవారం నాటికి 56,342కు చేరగా 1,886 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 16,540మంది కోలుకుని డిశ్ఛార్జి కాగా మరో 37,916 మంది చికిత్స పొందుతున్నారు. అయితే మహారాష్ట్ర, గుజరాత్‌లలో పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు కేంద్రం తెలిపింది. ఈ రెండు రాష్ట్రాల్లో కరోనా కట్టడికి మరిన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. అంతేకాకుండా విదేశాల్లో చిక్కుకున్న వారిని ప్రత్యేక విమానాల ద్వారా స్వదేశాలకు రప్పించే కార్యక్రమం గురువారమే మొదలైంది. ఈ సందర్భంలో అన్ని రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. 

మహారాష్ట్రలో 694, గుజరాత్‌లో 425 మరణాలు..

మహారాష్ట్రలో కొవిడ్‌-19 విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 1216కొత్త కేసులు, 43మరణాలు సంభవించాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 17,974కి చేరగా 694మంది మృత్యువాతపడ్డారు. ముంబయి మహానగరంలో కరోనా తీవ్రత రోజురోజుకు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఒక్క ముంబయి నగరంలోనే కరోనా బాధితుల సంఖ్య 11వేలు దాటింది. గుజరాత్‌లో నిన్న కొత్తగా 387కేసులు నిర్ధారణ కావడంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7012కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 425మంది మృత్యువాతపడ్డారు. తమిళనాడులో వైరస్‌ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. కేవలం నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 580కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 5409కి చేరగా 37మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ రాజధాని దిల్లోలోనూ బుధవారం ఒక్కరోజే 448 కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో దీల్లీలో ఈ వైరస్‌ బారినపడినవారి సంఖ్య 5980కి చేరగా 66మంది మరణించారు. మధ్యప్రదేశ్‌లోనూ కొవిడ్‌ ఉద్ధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో మొత్తం 3252 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా ఇప్పటివరకు 193మంది మరణించారు. పశ్చిమ బెంగాల్‌లోనూ కరోనా మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 151మంది మృత్యువాతపడగా మొత్తం 1548 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాజస్థాన్‌లో ఇప్పటివరకు కరోనా సోకిన 97మంది ప్రాణాలు కోల్పోయారు.

ఆంధ్రప్రదేశ్‌లో 1833, తెలంగాణలో 1122 కేసులు..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ తీవ్రత కొనసాగుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో నిన్న ఒక్కరోజే 56పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కావడంతో మొత్తం బాధితుల సంఖ్య 1833కి చేరింది. వీరిలో ఇప్పటివరకు 38మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక తెలంగాణలో నిన్న కొత్తగా 15 కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1122కి చేరగా 29మంది చనిపోయారు.

ఇవీ చదవండి..

కరోనా ఎఫెక్ట్‌: భారత్‌కు యునిసెఫ్‌ హెచ్చరిక

అలాగైతే అమెరికా శత్రువు వైరస్..చైనా కాదు


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని