భౌతిక దూరం.. వినూత్న ఐడియాలు!

తాజా వార్తలు

Published : 16/05/2020 01:59 IST

భౌతిక దూరం.. వినూత్న ఐడియాలు!

బెర్లిన్‌: ఇప్పుడిప్పుడే చాలా దేశాలు లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలిస్తుండటంతో కరోనా వైరస్‌ కట్టడికి సామాజిక దూరమే నివారణ మంత్రం కానుంది. టీకాలు, ఔషధాలు లేని ఈ కష్టకాలంలో దాన్ని పాటించడమే మన ఆరోగ్యానికి శ్రీరామ రక్ష. ఆ ప్రాముఖ్యతను గుర్తించిన వ్యక్తులు, దేశాలు ఇప్పుడు తమ మెదడుకు పదును పెడుతున్నాయి. ఆ ఆలోచనలు కొన్ని నవ్వు తెప్పిస్తుండగా, మరి కొన్ని వావ్ అనిపిస్తున్నాయి. అవేంటో మీరూ చూడండి.

తల మీద నూడుల్స్: కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ నుంచి జర్మనీ ఇప్పుడిప్పుడే బయటకు వస్తోంది. దాంతో తాము, తమ వినియోగదారులు సురక్షితంగా ఉండటానికి అక్కడి ఓ కేఫ్ వినూత్నంగా ఆలోచించింది. అత్యంత తేలికగా ఉండే స్విమ్మింగ్ పూల్‌ నూడుల్స్‌తో క్యాప్‌ను తయారు చేసి వచ్చిన కస్టమర్లకు అందిస్తోంది. ఆ నూడుల్స్‌ పొడవుగా ఉండటంతో ఆటోమెటిగ్గా ఎవరైనా సరే దూరం దూరంగా కూర్చోవాల్సిందే. ఆ కేఫ్ తన ఆలోచనను ఫేస్‌బుక్‌లో షేర్ చేసింది. ఆ ఫొటోలను చూసిన నెటిజన్లు కేఫ్ యజమానులను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

చైనాలో హెడ్ గేర్: కరోనా వైరస్‌ పుట్టిల్లుగా భావిస్తున్న చైనాలో దాని ప్రభావం చాలా వరకు తగ్గిపోయింది. దాంతో అక్కడక్కడా పాఠశాలలు కూడా తెరుచుకుంటున్నాయి. అక్కడి ఓ నగరంలోని పాఠశాలలో విద్యార్థులు హెడ్ గేర్లు ధరించి ఉన్న చిత్రాలు నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి. ఆ ఆలోచనకు మూలం చైనీయులను పాలించిన సాంగ్ వంశంలోనే ఉంది. కోర్టు గదుల్లో అధికారులు ఒకరికొకరు చెవులు కొరుక్కోకుండా ఈ హెడ్ గేర్ల లాంటివే ధరించేవారట. 

 

సరుకులకు తనకు బదులుగా రోబో: తమిళనాడులో ఓ వ్యక్తి తనకు బదులుగా సరుకులు తెచ్చుకోవడానికి ఓ రోబోను వరసలో నిలబెట్టాడు. ఇంజనీరింగ్ చదివిన ఆ వ్యక్తి రూ.3,000 ఖర్చు పెట్టి నాలుగు చక్రాల రోబోను రూపొందించాడు. ఆ చక్రాల మీద ఓ అట్టపెట్టను పెట్టి సరుకులకు పంపాడు. 

 


 

సింగపూర్‌లో రోబో శునకం: బహిరంగ ప్రదేశాల్లో ప్రజలందరూ సామాజిక దూరం పాటించేలా చూసేందుకు సింగపూర్ అధికారులు రోబో శునకాన్ని కాపలా పెట్టారు. అక్కడి సెంట్రల్ పార్కులో జాగింగ్‌కి వచ్చేవారు, సైక్లింగ్ చేసేవారు తగినదూరం పాటించేలా ఈ శునకానికి బాధ్యతలు అప్పగించారు. కరోనా వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి సోకకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరు కనీసం మూడు నుంచి ఆరు అడుగుల దూరం పాటించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల మేరకు ప్రజలు ఈ వినూత్న ఆలోచనలు చేస్తున్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని