దిల్లీలో బస్సులకు ఓకే.. సెలూన్లకు నో! 

తాజా వార్తలు

Published : 18/05/2020 20:03 IST

దిల్లీలో బస్సులకు ఓకే.. సెలూన్లకు నో! 

లాక్‌డౌన్‌ నిబంధనల్ని సడలించిన దిల్లీ సర్కార్‌

దిల్లీ: దేశ రాజధాని నగరంలో ప్రభుత్వం లాక్‌డౌన్‌ ఆంక్షల్ని సడలించింది. కరోనా వైరస్‌ కట్టడే లక్ష్యంగా లాక్‌డౌన్‌ -4 ఈ నెల 31వరకు కొనసాగనున్న వేళ దిల్లీలో మార్కెట్లు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లను సరి-బేసి విధానంలో తెరుచుకొనేందుకు అనుమతిస్తున్నట్టు సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ వెల్లడించారు. బస్సులు, ఆటోలు, టాక్సీలను పరిమిత సంఖ్యలో ప్రయాణికులతో నడుపుకోవచ్చన్నారు. ప్రస్తుతానికి సెలూన్లు తెరుచుకోవనీ.. మిగతా దుకాణాలన్నీ తమ కార్యకలాపాలను పునఃప్రారంభిస్తాయని తెలిపారు. ఈ మార్పులేవీ కంటైన్‌మెంట్‌ జోన్లకు వర్తించవని ముఖ్యమంత్రి  స్పష్టంచేశారు. సోమవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఆర్థిక కార్యకలాపాలను కొనసాగించడం ద్వారా క్రమంగా మనం ముందుకు సాగాలి. వ్యాక్సిన్‌ వచ్చేంత వరకు ఈ పరిస్థితి నుంచి బయటపడలేం. కరోనాతో ఎలా జీవించాలో మనం నేర్చుకోవాలి. ఇప్పటివరకు 10వేలకు పైగా కేసులు దిల్లీలో నమోదవడంతో మాస్కులు, భౌతికదూరం పాటించడం అత్యవసరం’’ అని చెప్పారు.

వేటిని అనుమతి.. దేనికి లేదు!
> ట్యాక్సీలు, క్యాబ్‌లు ఇద్దరు ప్రయాణికులతోనే నడపాలి. మ్యాక్సీ క్యాబ్‌ల్లో అయితే నలుగురు వరకు ప్రయాణించవచ్చు. 
> క్యాబ్‌ల్లో ప్రతి రైడ్‌కూ వైరస్‌ నియంత్రణ రసాయనాలు పిచికారీ చేసే బాధ్యత డ్రైవర్‌దే.
> మార్కెట్లు సరి- బేసి విధానంలో  తెరుచుకుంటాయి.
> ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలన్నీ ప్రారంభమవుతాయి. 
> బస్సుల్లో 20మందికి మించరాదు. ఎక్కేముందు ప్రతి ఒక్కరికీ స్క్రీనింగ్‌ చేయాలి.
> కార్లలో అయితే ఇద్దరికే అనుమతి.. ద్విచక్రవాహనాల్లో ఒక్కరికే. 
> రెస్టారెంట్లు తెరుచుకోవచ్చు గానీ.. హోండెలివరీకే అనుమతి
> నిర్మాణ కార్యకలాపాలు ప్రారంభించుకోవచ్చు. బయట నుంచి కూలీలకు అనుమతిలేదు. 
> వివాహ వేడుకలకు 50మంది వరకే అనుమతి
> ఎవరైనా మరణిస్తే అంత్యక్రియల్లో పాల్గొనేందుకు 20 మందికి మించరాదు. 
> హోటళ్లు, సినిమా థియేటర్లు, షాపింగ్‌ మాల్స్‌, జిమ్‌లు, స్విమ్మింగ్‌ పూల్స్‌, ఎంటర్‌టెయిన్‌మెంట్‌ పార్కులు, బార్‌లు, ఆడిటోరియాలు తెరిచేందుకు అనుమతిలేదు. 
> సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, విద్యా సంబంధ‌, సాంస్కృతిక, మతపరమైన సమావేశాలు అనుమతించం
> ఆలయాలు, ప్రార్థనా మందిరాలు తెరుచుకోవు.
> హెయిర్‌ సెలూన్లు, స్పాలు మూసే ఉంటాయి.
> రాత్రి 7గంటల నుంచి ఉదయం 7గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుంది. కేవలం అత్యవసర సర్వీసులకు మాత్రమే అనుమతి ఉంటుంది.
> స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లు, స్టేడియాలు తెరుచుకోవచ్చు. కానీ గుంపులను అనుమతించరాదు.
> పదేళ్లు లోపు చిన్నారులు, 65ఏళ్లు పైబడిన వృద్ధులు, గర్భిణులు, ఇతర ఆరోగ్యసంబంధ సమస్యలు ఉన్నవారు ఎవరైనా అత్యవసరమైతేనే బయటకు రావాలి. 

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని