తుపాను కల్లోలం.. తీరం దాటిన ‘అంపన్‌’
close

తాజా వార్తలు

Updated : 20/05/2020 20:52 IST

తుపాను కల్లోలం.. తీరం దాటిన ‘అంపన్‌’

బెంగాల్‌లో ఇద్దరు మృతి.. భీకర గాలులు, భారీ వర్షాలు

కోల్‌కతా: అతి తీవ్ర తుపాను అంపన్‌ భీకర గాలుల మధ్య బెంగాల్‌ తీరం దాటింది. మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 6.30గంటల వరకు తీరం దాటే ప్రక్రియ కొనసాగింది. బెంగాల్‌ - బంగ్లాదేశ్‌ మధ్య సుందర్బన్‌  సమీపంలో ఈ పెను తుపాను తీరం దాటినట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ రాత్రి 7గంటల కల్లా పూర్తిగా తీరం దాటిందని వెల్లడించారు. ఈ సందర్భంగా వీచిన భీకర గాలులు కోల్‌కతాలో బీభత్సం సృష్టించాయి. ఈ తుపాను దాటికి బెంగాల్‌లో ఇద్దరు మృతిచెందారు.

కోల్‌కతాలో బంద్‌ వాతావరణం
తీరం దాటాక ఈ తుపాను ఉత్తర ఈశాన్యం దిశగా కోల్‌కతా సమీపం వైపు పయనించినట్టు అధికారులు తెలిపారు. తుపాను తీరం దాటిన అనంతర ప్రభావంతో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లడంతో పాటు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో కోల్‌కతాలో బంద్‌ వాతావరణం నెలకొంది.  కరోనాతో విధించిన లాక్‌డౌన్‌ ఉత్తర్వులను సడలించడంతో తెరుచుకున్న మార్కెట్లను సైతం ఈ తుపాను దాటికి మూసివేశారు.

ఆ నాలుగు గంటలూ భీకర గాలలు.. భారీ వర్షం

అంపన్‌ తీరం దాటిన సమయంలో గంటకు 160కి.మీల వేగంతో భీకర గాలులు వీయడంతో పాటు ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీరం దాటే ప్రక్రియ కొనసాగిన నాలుగు గంటల పాటు అదే స్థాయిలో గాలులు, వర్షాల తీవ్రతా కొనసాగినట్టు అధికారులు తెలిపారు. తుపాను బలహీన పడటానికి ముందు, తీరం దాటిన తర్వాత గాలుల తీవ్రత గంటకు 110 కి.మీల నుంచి 120 కి.మీల వేగంతో వీస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. బంగ్లాదేశ్ వైపు వెళ్లిన తర్వాత తీవ్ర వాయు గుండంగా బలహీనపడుతుందని చెప్పారు. ఈ మేరకు బంగ్లాదేశ్‌కు తుపాను హెచ్చరిక జారీ చేశారు. ఈ తుపానుపై తమ అంచనాలు నిజమైనట్టు వాతావరణ శాఖ చీఫ్‌ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు. మరోవైపు, ఒడిశాలో 6.5లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఒడిశాలో పూరీ జిల్లాలోని హరిదాస్‌పూర్‌, కకట్‌పూర్‌లలో భారీ వర్షాలకు రోడ్లపై కూలిన చెట్లను ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది తొలగించారు. 

కూలిన చెట్లు.. రోడ్లకు బీటలు

తుపాను తీరం దాటిన అనంతరం పశ్చిమబెంగాల్‌పై తీవ్ర ప్రభావం కనబడుతోంది. తీరం దాటాక గాలులు తీవ్రత పెరగడంతో పాటు భారీ వర్షాలు కురుస్తున్నాయి. భీకర గాలులు ధాటికి పెద్ద పెద్ద చెట్లు, విద్యుత్‌, టెలిఫోన్‌ స్తంభాలు నేలకూలాయి. వృక్షాలు కార్లపై పడటంతో వాహనాలు ధ్వంసమయ్యాయి. రోడ్లు బీటలు వారాయి. హుగ్ల్లీ, హావ్‌డా, ఉత్తర, దక్షిణ 24 పరగణాస్‌, తూర్పు మిడ్నాపూర్‌ జిల్లాలపై తుపాను ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా 5లక్షల మందికి పైగా పునరావాస కేంద్రాలకు తరలించారు. 

ఈ రోజు, రేపు ఏసీ ప్రత్యేక రైళ్ల రద్దు

మరోవైపు, ఈ తుపాను ప్రభావంతో ఈ రోజు హావ్‌డా నుంచి దిల్లీకి; రేపు దిల్లీ నుంచి హావ్‌డాకు రావాల్సిన ఏసీ ప్రత్యేక  రైళ్లను తూర్పు రైల్వే రద్దు చేసింది. అలాగే, హిమాచల్‌ప్రదేశ్ నుంచి కోల్‌కతాకు రావాల్సిన ప్రత్యేక రైళ్లనూ రద్దు రద్దు చేసింది. కోల్‌కతాలోని డండం విమానాశ్రాయన్ని సాయంత్రం 5గంటల వరకు మూసివేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని