‘అంపన్‌’ బీభత్సం.. 84మంది మృతి 
close

తాజా వార్తలు

Updated : 22/05/2020 12:32 IST

‘అంపన్‌’ బీభత్సం.. 84మంది మృతి 

కోల్‌కతా: బంగాళాఖాతంలో ఏర్పడిన అంపన్‌ పెను తుపాను బెంగాల్‌లో బీభత్సం సృష్టించింది. పశ్చిమ బెంగాల్‌, ఒడిశా, బంగ్లాదేశ్‌లను తీవ్ర స్థాయిలో కుదిపేసింది. ఈ తుపాను దాటికి బెంగాల్‌లో భారీ ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. తుపాను తీరం దాటిన సమయంలో వీచిన భీకర గాలులు, భారీ వర్షాలకు 84మంది మృతిచెందగా.. అనేక మంది గాయపడ్డారు. ఒక్క బెంగాల్ రాష్ట్రంలోనే 72మంది మృతిచెందినట్టు సీఎం మమతాబెనర్జీ వెల్లడించారు. వీరిలో 15 మంది కోల్‌కతాకు చెందినవారేనన్నారు. అంపన్‌ తీవ్రతకు తీర ప్రాంత గ్రామాలతో పాటు కోల్‌కతా వంటి నగరాల్లోనూ పెను విధ్వంసం సృష్టించింది. బెంగాల్‌లో వేల సంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయి. భారీ సంఖ్యలో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. మరోవైపు, ఒడిశాలో పంటలు దెబ్బతిన్నాయి. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.

మృతులకు పరిహారం ప్రకటించిన దీదీ
రాష్ట్రంలో ఈ తుపాను తీవ్రతతో మృతిచెందిన వారికి సీఎం మమతా బెనర్జీ పరిహారం ప్రకటించారు. ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.2లక్షలు నుంచి రూ.2.5లక్షల వరకు పరిహారం ఇవ్వనున్నట్టు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీని సుందర్బన్స్ ప్రాంతంలో పర్యటించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాల్లో పునరుద్ధరణ కోసం ఆర్థికసాయం చేయాలన్నారు. కేంద్రమంత్రి అమిత్‌ షా తనతో మధ్యాహ్నం మాట్లాడారని చెప్పారు.  

బంగ్లాదేశ్‌లో 10మంది మృతి
ఈ పెను తుపాను దాటికి బంగ్లాదేశ్‌లో 10మంది ప్రాణాలు కోల్పోయారు. తీర ప్రాంతంలోని గ్రామాల్లో విధ్వంసం సృష్టించింది. అనేక చోట్ల ఇళ్లు దెబ్బతిన్నాయని అధికారులు వెల్లడించారు. అలాగే, ఒడిశాలో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. 

బెంగాల్‌కు అండగా ఉంటాం..: ప్రధాని మోదీ
అంపన్‌ తుపాను బీభత్సంపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తంచేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వం తరఫున అవసరమైన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అంపన్‌ పెను తుపాను తీవ్ర విధ్వంసం సృష్టించిందని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ సవాల్‌ సమయంలో యావత్‌ దేశం తరఫున బెంగాల్‌కు సంఘీభావం తెలిపారు. ప్రజలు క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నటు పేర్కొన్నారు. ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. 

బెంగాల్‌, ఒడిశా సీఎంలకు అమిత్‌ షా ఫోన్‌

మరోవైపు, బెంగాల్‌, ఒడిశా సీఎంలతో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మాట్లాడారు. కేంద్రం తరఫున సాయం అందిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. రెండు రాష్ట్రాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించామని ఆయన ట్విటర్‌లో తెలిపారు. ఇప్పటికే ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతున్నాయని పేర్కొన్నారు. అధికారులతో నిరంతరం టచ్‌లో ఉంటూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇరు రాష్ట్రాల్లోని ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని విజ్ఞప్తి చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని