బెంగాల్‌కు రూ.1000 కోట్లు ప్రకటించిన మోదీ
close

తాజా వార్తలు

Updated : 22/05/2020 16:21 IST

బెంగాల్‌కు రూ.1000 కోట్లు ప్రకటించిన మోదీ

‘అంపన్‌’ ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని ఏరియల్ సర్వే

 బెంగాల్‌లో 80కి చేరిన మృతులు

కోల్‌కతా: అత్యంత తీవ్ర తుపాను ‘అంపన్‌’ బీభత్సంతో చిగురుటాకులా వణికిన పశ్చిమ బెంగాల్‌కు కేంద్రం తక్షణ సాయంగా రూ.1000 కోట్లు ప్రకటించింది. శుక్రవారం మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోదీ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో కలిసి ఏరియల్‌ సర్వే నిర్వహించారు. అనంతరం ఉత్తర 24 పరగాణాస్‌ జిల్లాలోని బషిర్‌హాత్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో తక్షణ సహాయ చర్యల నిమిత్తం ఈ మొత్తాన్ని ప్రకటించినట్టు తెలిపారు. అంపన్‌ నష్టాన్ని కేంద్ర బృందం వచ్చి సమగ్రంగా సర్వే చేస్తుందన్నారు. ఈ తుపాను ప్రభావం నుంచి బెంగాల్‌ కోలుకొని మరింత ముందుకెళ్లాలని ఆయన ఆకాంక్షించారు. ఈ ప్రకృతి విలయంతో తీవ్రంగా నష్టపోయిన బెంగాల్‌ను పునర్నిర్మించేందుకు మమతతో కలిసి పనిచేస్తామన్నారు. నష్టపోయిన ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు. ఈ తుపాను వల్ల మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.2లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50వేలు చొప్పున ప్రధాని పరిహారం ప్రకటించారు. 

బెంగాల్‌లో 80కి చేరిన మరణాలు

మరోవైపు, ఈ ప్రకృతి విపత్తుతో బెంగాల్‌లో భారీ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. నిన్నటి వరకు 72మంది మృతిచెందగా.. గురువారం రాత్రి నుంచి మరికొన్ని మృతదేహాలను వేర్వేరు చోట్ల గుర్తించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 80కి పెరిగింది. ఈ తుపానుతో స్తంభించిన జనజీవనాన్ని సాధారణ పరిస్థితిలోకి తెచ్చేందుకు స్థానిక అధికారులు, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. గత శతాబ్ద కాలంగా ఎన్నడూ ఎరుగనంత స్థాయిలో బెంగాల్‌ను ఈ తుపాను నష్టపరిచింది. దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ  కోరనున్నారు. ఈ విపత్తుతో లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. కోల్‌కతాతో పాటు పలు జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది.  

కాసేపట్లో ఒడిశాకు మోదీ

బెంగాల్‌లో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ఒడిశాకు బయల్దేరి వెళ్లనున్నారు. అక్కడ తుపానుతో నెలకొన్న నష్టాన్ని పరిశీలించనున్నారు. 

మమతకు రాష్ట్రపతి, ఒడిశా సీఎం ఫోన్‌

బెంగాల్‌ను అంపన్‌ తీవ్రంగా దెబ్బ తీసిన నేపథ్యంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సీఎం మమతా బెనర్జీతో మాట్లాడారు. ఆ రాష్ట్రానికి తన మద్దతును ప్రకటించారు. అత్యంత కష్టసమయంలో ఉన్న తమ రాష్ట్ర ప్రజలకు మద్దతుగా నిలిచినందుకు మమతా బెనర్జీ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.  ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ కూడా దీదీకి ఫోన్‌ చేసి మాట్లాడారు. రాష్ట్రంలో నష్టం తీవ్రతను అడిగి తెలుసుకున్నారు. తమకు సాధ్యమైనంత మేర సాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సంక్షోభ సమయంలో బెంగాల్‌కు అండగా ఉంటామని నవీన్‌ అన్నారని ఒడిశా సీఎంవో ఓ ప్రకటనలో వెల్లడించింది. 

యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు

కోల్‌కతా సహా ఉత్తర, దక్షిణ పరగణాస్‌ జిల్లాలతో పాటు పలు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు కొనసాగిస్తున్నాయి. భీకర గాలులకు వేలాది చెట్లు నేలకూలగా.. ఇప్పటివరకు 5వేలకు పైగా చెట్లను తొలగించారు. కోల్‌కతాలో మరో రెండు మూడు రోజుల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని భావిస్తున్నట్టు నగర మేయర్‌ ఫరీద్‌ హకీం తెలిపారు. అప్పటివరకు ప్రజలు ఇంట్లోనే ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 

నా జీవితంలో ఇలాంటి విపత్తు చూడలేదు: దీదీ

ఈ ఉదయం ప్రధాని కోల్‌కతా విమానాశ్రయానికి చేరుకోగానే సీఎం మమతా బెనర్జీ ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడుతూ..  తన జీవితంలో ఇలాంటి విపత్తు చూడలేదన్నారు. దాదాపు ఆరు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు చెప్పారు. రాష్ట్రంలో 60శాతం మంది ప్రజలు ఈ తుపాను తీవ్రతకు ప్రభావితమయ్యారని వివరించారు. భారీ ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తంచేశారు. 

మృతులకు రాహుల్ సంతాపం
బెంగాల్‌లో అంపన్‌ సృష్టించిన విధ్వంసంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విపత్తుకు ప్రాణాలు కోల్పోయినవారికి సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు.

 

 
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని