తొలి రోజే 80 సర్వీసులు రద్దు..!

తాజా వార్తలు

Published : 25/05/2020 14:00 IST

తొలి రోజే 80 సర్వీసులు రద్దు..!

రాష్ట్రాల నిరాకరణ వల్లేనని అధికారులు వివరణ

దిల్లీ: రెండు నెలల తర్వాత దేశీయ విమాన సర్వీసులు పునఃప్రారంభం కావడంతో నేడు దేశంలోని ప్రధాన విమానాశ్రయాలన్నీ రద్దీగా కనిపించాయి. అయితే, విమానాలకు సంబంధించి పక్కా సమాచారం లేకపోవడంతో ప్రయాణికులు కాస్త ఇబ్బంది పడ్డారు. ఎలాంటి సమాచారం లేకుండా చివరి క్షణంలో సర్వీసుల్ని రద్దు చేయడంతో అనేక మంది నిరాశకు గురయ్యారు. ఎయిర్‌పోర్టు లాంజ్‌ల్లోనే గంటలతరబడి పడిగాపులు కాస్తున్నారు.  

దీనిపై వివరణ ఇచ్చిన అధికారులు.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిరాకరించడం వల్లే దిల్లీ నుంచి రాకపోకలు సాగించే దాదాపు 80 సర్వీసుల్ని నిలిపివేసినట్లు తెలిపారు. మరికొన్నింటిని రీషెడ్యూల్‌ చేశామన్నారు. అయితే, దీనిపై ప్రయాణికులకు సమాచారం ఇవ్వకపోవడంతో వారంతా ఈ ఉదయం విమానాశ్రయాలకు చేరుకొని వేచిచూశారు. తీరా విషయం తెలుసుకొని నిరాశకు గురయ్యారు. ఉదయం కొద్దిసేపు దాదాపు అన్ని నగరాల్లోని ప్రధాన విమానాశ్రయాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఆరోగ్యసేతు యాప్‌ నిర్ధారణ, ప్రతిఒక్కరికీ థర్మల్‌ స్ర్కీనింగ్‌ నిర్వహించాల్సి ఉండడంతో విమానాశ్రయాల ప్రవేశ ద్వార్వాల వద్ద భారీ క్యూలు ఏర్పడ్డాయి.

ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ మినహా మిగతా అన్ని రాష్ట్రాల్లో విమాన సేవల్ని పునరుద్ధరించారు. ఏపీలో బుధవారం నుంచి, పశ్చిమ బెంగాల్‌లో గురువారం నుంచి విమానాల రాకపోకలు మొదలవుతాయి. మరోవైపు, విమాన ప్రయాణికులను క్వారంటైన్‌లో ఉంచడంపై పలు రాష్ట్రాలు విడుదల చేసిన మార్గదర్శకాలు భిన్నంగా ఉండడంతో గందరగోళం తలెత్తుతోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని