అమెరికాలో లక్ష దాటేసిన కరోనా మరణాలు 

తాజా వార్తలు

Published : 28/05/2020 23:09 IST

అమెరికాలో లక్ష దాటేసిన కరోనా మరణాలు 

వాషింగ్టన్‌: కరోనా విసిరిన పంజాతో అమెరికా విలవిలలాడుతోంది. చైనాలో పుట్టి ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఈ మహమ్మారి అమెరికాలో మృత్యునాదం చేస్తోంది. అగ్రరాజ్యాన్ని భారీ ఆర్థిక, ప్రాణ నష్టానికి గురిచేసింది. కొవిడ్‌ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య అమెరికాలో లక్ష దాటేసింది. ప్రపంచంలో చోటుచేసుకున్న కరోనా మరణాల్లో ఇదే అత్యధికం. అమెరికాలో కరోనాతో లక్ష మంది చనిపోయినట్టు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అధికారికంగా ప్రకటించారు. అత్యంత విషాదకరమైన మైలు రాయిని చేరామంటూ ట్విటర్‌లో విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. 

అమెరికాలో తొలి కరోనా కేసు జనవరిలో నమోదైనప్పటి నుంచి దీని వ్యాప్తి క్రమంగా పుంజుకొని ఉగ్ర రూపం దాల్చింది. ఆధునిక ఆరోగ్య వ్యవస్థ ఉన్న అమెరికాలో దాదాపు 17 లక్షల కేసులు నమోదవ్వడం ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తోంది. ఇప్పటివరకు కోటిన్నర మందికి పైగా పరీక్షలు నిర్వహించగా.. 17 లక్షలకు పైగా పాజిటివ్‌ కేసులు; 1,00,276 మరణాలు నమోదైనట్టు జాన్‌ హాప్‌కిన్స్‌ విశ్వవిద్యాలయం వెల్లడించింది. అగ్రరాజ్యంలో ప్రముఖ పత్రికలు కరోనా మృతుల సంస్మరణ ప్రకటనలతో నిండిపోతుండటం అక్కడి తీవ్రతకు అద్దంపడుతోంది.  

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 55 లక్షలకు పైగా కేసులు, 3.5 లక్షలకు పైగా మరణాలు నమోదయ్యాయి. అయితే మొత్తం పాజిటివ్‌ కేసుల్లో 30శాతం, మరణాల్లో 28 శాతం అమెరికాలోనివే కావడం గమనార్హం. కొవిడ్-19 దెబ్బకు ఒక్క న్యూయార్క్‌ రాష్ట్రంలోనే 29వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. అక్కడ 3.7 లక్షల కేసులు నమోదయ్యాయి. న్యూజెర్సీలో 10 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇల్లినాయిస్‌, కాలిఫోర్నియా, మేరీల్యాండ్‌ తదితర రాష్ట్రాల్లో ఈ వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. ప్రపంచ కరోనా మరణాల రేటు 6.4శాతంగా ఉండగా.. అమెరికాలో అది 5.26 శాతంగా ఉంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని