హెచ్‌సీక్యూ వల్ల వైరస్‌ ముప్పు తగ్గుతుంది

తాజా వార్తలు

Published : 01/06/2020 08:23 IST

హెచ్‌సీక్యూ వల్ల వైరస్‌ ముప్పు తగ్గుతుంది

పునరుద్ఘాటించిన ఐసీఎంఆర్‌ అధ్యయనం

దిల్లీ: వ్యక్తిగత రక్షణ పరికరాల(పీపీఈ) వాడకంతో పాటు యాంటీ-మలేరియా ఔషధం హైడ్రాక్సీ క్లోరోక్విన్‌(హెచ్‌సీక్యూ)ను నిరంతరం తీసుకోవడం వల్ల కరోనా వైరస్‌ సోకే ముప్పు తగ్గుతుందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) తాజా అధ్యయనం పునరుద్ఘాటించింది. హెచ్‌సీక్యూ వాడకం వల్ల కరోనాపై పోరులో దేశాన్ని ముందుండి నడిపిస్తున్న వైద్యులు, ఇతర సిబ్బంది కరోనా వైరస్ బారిన పడటం గణనీయంగా తగ్గిందని తేల్చింది. ఈ మేరకు ‘ఇండియన్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చి’(ఐజేఎంఆర్‌)లో ఆదివారం పరిశోధనా ఫలితాలు ప్రచురితం అయ్యాయి. నాలుగు కంటే ఎక్కువ డోసులు తీసుకోవడం వల్ల వైరస్‌ సోకే ముప్పు గణనీయంగా తగ్గినట్లు పేర్కొంది. హెచ్‌సీక్యూ కారణంగా కొవిడ్‌ బాధితుల్లో మృత్యు ముప్పు పెరుగుతుందని పలు విదేశీ అధ్యయనాలు పేర్కొన్న విషయం తెలిసిందే. దీంతో సంబంధిత క్లినికల్‌ పరీక్షలను తాత్కాలికంగా నిలిపివేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తాజా ఐసీఎంఆర్‌ అధ్యయనానికి ప్రాధాన్యం ఏర్పడింది.

ఈసారి హెచ్‌సీక్యూ సామర్థ్యంపై కాకుండా హెల్త్‌కేర్‌ వర్కర్లకు వైరస్‌ సోకే ముప్పునకు గల కారణాల కోసమే అధ్యయనం చేసినట్లు పరిశోధకులు తెలిపారు. ఈ అధ్యయనంలో హెచ్‌సీక్యూ ఎంత మోతాదులో తీసుకుంటే వైరస్ సంక్రమించే అవకాశం తగ్గుతుందో కూడా గమనించామని వెల్లడించారు. అయితే, ఈ ఔషధం ఒక్కటి తీసుకుంటే సరిపోదని.. తగు పీపీఈ కిట్లను సైతం వాడాల్సిందేనని స్పష్టం చేశారు. కొవిడ్‌-19 తీవ్ర స్థాయిలో ఉన్నవారిలో మాత్రం ఇది ఎలాంటి ప్రయోజనాలను అందించలేదని తమ విశ్లేషణలో తేలిందన్నారు. పైగా మృత్యు ముప్పును పెంచే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. వైరస్‌ బారిన పడకుండా మాత్రమే హెచ్‌సీక్యూ ఆపగలదని తెలిపారు. కానీ, వైరస్‌ ముందే శరీరంలోకి వెళ్లి పరిస్థితి తీవ్ర స్థాయిలో ఉన్నవారిపై ఈ ఔషధం పెద్దగా ప్రభావం చూపదని స్పష్టం చేశారు.

ఇక అధ్యయనం జరిపిన వారిలో చాలా తక్కువ మందిలో దుష్పరిణామాలు గమనించినట్లు అధ్యయనంలో తెలిపారు. 8శాతం మందిలో వికారం, ఐదు శాతం మందిలో తలనొప్పి, 4శాతం మందిలో విరేచనాలు గమనించినట్లు పేర్కొన్నారు. గుండె సంబంధిత సమస్యలు మాత్రం ఎవరిలోనూ తలెత్తలేదని స్పష్టం చేశారు. ఈ అధ్యయనంలో మొత్తం 1173 మందిని పరీక్షించారు. వీరిలో 624 మంది వైరస్‌ సోకినవారు కాగా, 549 మంది ముందస్తుగా ఔషధాన్ని తీసుకున్నవారు.

ఇదీ చదవండి..

ఒక్కరోజులో 8,380


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని