సమాజంలో జాత్యహంకారానికి చోటు లేదు..

తాజా వార్తలు

Published : 02/06/2020 10:11 IST

సమాజంలో జాత్యహంకారానికి చోటు లేదు..

అమెరికాలో నిరసనలపై ప్రముఖుల సందేశాలు

వాషింగ్టన్‌: సమాజంలో ద్వేషం, జాత్యహంకారానికి చోటు లేదని మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదేళ్ల వ్యాఖ్యానించారు. ఇతరుల భావాల్ని అర్థం చేసుకొని గౌరవించడం, పరస్పర అవగాహన కేవలం ప్రారంభం మాత్రమేనని.. ఇంకా చేయాల్సింది చాలా ఉందని అభిప్రాయపడ్డారు. నల్లజాతి అమెరికన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌ మృతికి నిరసనగా అమెరికాలో జరుగుతున్న నిరసనల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అలాగే, కంపెనీలోని నల్లజాతి, ఆఫ్రికన్‌ అమెరికన్ల స్వరాన్ని వినిపించేందుకు మైక్రోసాఫ్ట్‌ను వేదికగా నిలుపుతామని సంస్థ ప్రకటించింది. 

మరోవైపు ప్రముఖ భారతీయ అమెరికన్‌, పెప్సీకో మాజీ సీఈఓ ఇంద్రా నూయి సైతం అల్లర్ల నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘జార్జ్‌ ఫ్లాయిడ్‌, బ్రియోన్నా టేలర్‌, అహ్మదు అర్బెరీ మృతికి నిరసనగా లక్షలాది మంది అమెరికన్లు గత వారం రోజులుగా గొంతెత్తున్నారు. వారి బాధను, దానికి కారణమైన వ్యవస్థీకృత జాత్యహంకారాన్ని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. వారికి న్యాయం చేయడం కోసం కృషి చేస్తున్న సంస్థలకు మద్దతుగా నిలవాలి. ఈ గాయాన్ని ఎలా నయం చేయాలో కూడా ఆలోచించాలి. వివక్షను బహిరంగంగానే ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తు కచ్చితంగా సవాల్‌గా మారనుంది. న్యాయం దిశగా సాగుతున్న సైన్యంలో మనందరం భాగస్వాములమవుదాం’’ అంటూ ట్విటర్‌ వేదికగా నూయి గంభీరమైన సందేశాన్నిచ్చారు. 

అంతకుముందు గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ సైతం జాతిపరమైన సమానత్వానికి మద్దతు పలికిన విషయం తెలిసిందే. పోలీసుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన ఫ్లాయిడ్‌ వంటివారిని స్మరించుకుంటూ ఆఫ్రికన్‌-అమెరికన్లకు బాసటగా అమెరికాలోని గూగుల్‌, యూట్యూబ్‌ హోం పేజిలను మార్చినట్లు పిచాయ్‌ తెలిపారు. ఆవేదనతో పోరాడుతున్నవారు ఏకాకులు కాదని, జాతి సమానత్వం కోసం ఉద్యమిస్తున్నవారికి తాము సంఘీభావంగా నిలుస్తామని చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని