సముచిత పరిష్కారానికే ప్రాధాన్యం: చైనా

తాజా వార్తలు

Published : 05/06/2020 21:09 IST

సముచిత పరిష్కారానికే ప్రాధాన్యం: చైనా

బీజింగ్: భారత్‌తో నెలకొన్న సరిహద్దు వివాదాన్ని సముచితంగా పరిష్కరించుకునేందుకు కట్టుబడి ఉన్నామని చైనా స్పష్టం చేసింది. ఇరు దేశాలకు చెందిన సైనిక ఉన్నతాధికారుల మధ్య సరిహద్దు వివాదానికి సంబంధించి శనివారం చర్చలు జరగనున్న నేపథ్యంలో చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జెంగ్ షువాంగ్ శుక్రవారం ఒక ప్రకటన చేశారు. ఈ మేరకు భారత్‌-చైనా రెండు దేశాల సరిహద్దులో ప్రస్తుత పరిస్థితులు నిలకడగా, అదుపులో ఉన్నాయని తెలిపారు.

‘‘మాకు సరిహద్దు నిర్వహణకు సంబంధించిన పూర్తిస్థాయి యంత్రాంగం ఉంది. వారితో మేము సన్నిహితంగా సమాచార మార్పిడి నిర్వహిస్తాం. భారత్‌తో సరిహద్దుకు సంబంధించిన సమస్యను సముచితంగా పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నాం’’ అని జెంగ్ పేర్కొన్నారు. కొద్ది రోజులుగా లద్దాఖ్ వద్ద సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తలు నెలకొన్న నేపథ్యంలో పరిస్థితులు చక్కదిద్దేందుకు భారత్-చైనా చర్యలకు ఉపక్రమించాయి. తొలి సారిగా లెఫ్టినెంట్ జనరల్ స్థాయి అధికారుల నేతృత్వంలో భేటీకి రంగం సిద్ధం చేశారు.

తూర్పు లద్దాఖ్‌లోని స్పంగూర్‌ గ్యాప్‌ సమీపంలో చుషూల్‌  ప్రాంతంలో శనివారం ఈ సమావేశం జరగనుంది. భారత్‌ తరఫున 14 కార్ప్స్‌ చెందిన లెఫ్టినెంట్ జనరల్ హరీందర్‌ సింగ్ చర్చల్లో పాల్గొనున్నట్లు సమాచారం. ఈ మేరకు సమస్య పరిష్కారం దిశగా భారత్‌ పలు ప్రతిపాదనలను చైనా ముందు ఉంచనుందని అధికారిక వర్గాలు తెలిపాయి. 2017లో డోక్లామ్‌ ప్రాంతంలో భారత్‌-చైనాల మధ్య ఘర్షణ వాతావరణం మూడు నెలల పాటు కొనసాగిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఇరు దేశాలు సమస్యను ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని