కరోనా: కేంద్ర ఉద్యోగులకు ఇవి తప్పనిసరి

తాజా వార్తలు

Published : 10/06/2020 01:24 IST

కరోనా: కేంద్ర ఉద్యోగులకు ఇవి తప్పనిసరి

దిల్లీ: దేశంలోని పలు ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, కార్యాలయాల ఉద్యోగులకు కరోనా వైరస్‌ సోకినట్టు నిర్ధారణ కావటం కలకలం రేపుతోంది. తాజాగా పెట్టుబడుల ఉపసంహరణ, రక్షణ తదితర శాఖల్లో అత్యున్నత స్థాయి అధికారులకు కొవిడ్‌-19 సోకిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌ సడలింపు నేపథ్యంలో... పని ప్రదేశాల్లో కరోనా వ్యాప్తి నిర్మూలనకు కేంద్రం తాజా మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నూతన నియమాలను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తప్పనిసరిగా పాటించాలంటూ ఆదేశాలు జారీఅయ్యాయి. తాజా ఆదేశాల ప్రకారం...

*ఏ విధమైన కొవిడ్‌-19 లక్షణాలు లేని సిబ్బంది మాత్రమే విధులకు హాజరు కావాలి. తేలికపాటి జలుబు, జ్వరం వంటి లక్షణాలున్నా ఇంటికే పరిమితం కావాలి. కంటైన్‌మెంట్‌ జోన్లలో నివసించే ఉద్యోగులు కార్యాలయాలకు రాకుండా... ఇంటి నుంచే పనిచేయాలి.

*కార్యాలయాల్లో కూర్చునేటపుడు, నడిచేప్పుడు ఒక మీటరు దూరం నిబంధన తప్పనిసరి. సందర్శకుల కుర్చీలను కూడా సామాజిక దూరం నిబంధనలకు అనుగుణంగా ఏర్పాటు చేయాలి.
*ఒక కార్యాలయంలో, ఒక సమయంలో గరిష్టంగా 20 మంది సిబ్బంది మాత్రమే ఉండాలి. ఇందుకు అనుగుణంగా వారిపనివేళల్లో మార్పులు చేయాలి. సిబ్బంది విడతల వారీగా హాజరయ్యేలా ఏర్పాటు చేయాలి. మిగిలిన వారు ఇంటినుంచే పనిచేయాలి.
*డిప్యుటీ సెక్రటరీ స్థాయి అధికారులు సామాజిక దూరం నిబంధనలను పాటించాలి. ఒకే క్యాబిన్‌ను ఎక్కువ మంది పంచుకొనే సందర్భంలో వారు రోజు విడిచి రోజు విధులకు హాజరు కావాలి.
*ఒక సెక్షన్‌లో ఇద్దరి కంటే ఎక్కువ అధికారులు ఉండరాదు. కార్యాలయాల్లో తాజా గాలి, వెలుతురు సోకేందుకు అనుగుణంగా కిటికీలను వీలయినంత వరకు తీసే ఉంచాలి.
*ఉద్యోగులు ముఖాన్ని కప్పిఉంచే మాస్కులు వంటివాటిని పూర్తి కాలం ధరించాలి. వాడేసిన మాస్కులు, గ్లౌజులను పసుపు రంగు డస్ట్‌బిన్‌లో మాత్రమే వేయాలి. ఈ నిబంధనలు పాటించని ఉద్యోగులపై క్రమశిక్షణ చర్య తీసుకుంటారు.
*విధుల్లో భాగంగా ముఖాముఖి సమావేశాలు, చర్చలను సాధ్యమైనంత వరకు నిరోధించాలి.  ఇంటర్‌కామ్‌, ఫోన్లు, వీడియో సమావేశాల ద్వారా కార్యకలాపాలు కొనసాగించాలి.
*సిబ్బందిలో ప్రతి ఒక్కరు అరగంటకోసారి చేతులు శుభ్రం చేసుకోవటం తప్పనిసరి. కార్యాలయ వరండాలు తదితర ఉమ్మడి ప్రదేశాల్లో శానిటైజర్లను ఏర్పాటు చేయాలి.
*కరెంట్‌ స్విచ్‌లు, డోర్‌ హ్యాండిల్స్‌, లిఫ్ట్‌ బటన్లు, టాయిలెట్లలోని కొళాయిలు తదితర వస్తువులు వంటివాటిని ప్రతి గంటకోసారి సోడియం హైపోక్లోరేట్‌ ద్రావణంతో శుభ్రం చేసే ఏర్పాట్లు చేయాలి. అంతేకాకుండా తాము ఉపయోగించే కీబోర్డులు, మౌస్‌, ఫోన్‌, ఏసీ రిమోట్‌ తదితరాలను తామే తరచుగా శుభ్రం చేసుకుంటూ ఉండాలి.
కార్యాలయాల్లో పై నియమాలన్నీ తప్పనిసరిగా అమలు జరిగేలా ఉన్నతాధికారులు జాగ్రత్త వహించాలి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని