ఆ నగరాల నుంచి వస్తే క్వారంటైన్‌ తప్పనిసరి!

తాజా వార్తలు

Published : 16/06/2020 01:33 IST

ఆ నగరాల నుంచి వస్తే క్వారంటైన్‌ తప్పనిసరి!

కర్ణాటక సీఎం యడియూరప్ప

బెంగళూరు: కర్ణాటకలో కరోనా వ్యాప్తి ఉద్ధృతమవుతున్న వేళ ఈ మహమ్మారిని కట్టడి చేయడమే లక్ష్యంగా కర్ణాటక ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్‌ విజృంభణ ఎక్కువగా ఉన్న దిల్లీ, చెన్నై నగరాల నుంచి తమ రాష్ట్రంలోకి వచ్చే వారు తప్పనిసరిగా క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని సీఎం యడియూరప్ప స్పష్టం చేశారు. మొత్తం క్వారంటైన్‌ కాలం (14 రోజులు)లో తొలి మూడు రోజులు సంస్థాగత క్వారంటైన్‌కు వెళ్లాల్సి ఉంటుందనీ.. మిగతా 11 రోజులు హోం ఐసోలేషన్‌లో ఉండాలని సీఎం సూచించారు. ఇప్పటివరకు మహారాష్ట్ర నుంచి వచ్చినవారికి మాత్రం ఏడు రోజులు సంస్థాగత క్వారంటైన్‌ చేస్తున్నారు. మిగతా రాష్ట్రాల నుంచి వచ్చే వారిలో లక్షణాలు లేకపోతే మాత్రం వారికి సంస్థాగత నిర్బంధం విధించకుండా.. వారందరూ హోం క్వారంటైన్‌లోనే ఉండాలని సూచిస్తు వచ్చారు.  

మరిన్ని మినహాయింపులు కోరతాం

అయితే, రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై మంత్రులు, అధికారులతో సీఎం చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేసుల తీవ్రత పెరిగిపోవడంతో చెన్నై, దిల్లీ నుంచి వచ్చిన వారికి సైతం సంస్థాగత క్వారంటైన్‌ విధించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. తమ రాష్ట్రంలో ఉన్నవారికంటే మిగతా ప్రాంతాల నుంచి వచ్చినవారిలోనే ఎక్కువ కేసులు వస్తుండటంతో రాకను నియంత్రించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. కరోనా వైరస్‌ కట్టడి చేసేందుకు నిజాయతీగా పనిచేస్తున్నామన్నారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదన్నారు. ఇంకా కొన్ని సడలింపులు ఇవ్వాలని ప్రధానిని కోరనున్నట్టు చెప్పారు. 

మహారాష్ట్ర నుంచి వచ్చిన కేసులే అత్యధికం

రాష్ట్రంలోని నిన్నటి వరకు మొత్తం 7వేల పాజిటివ్‌ కేసుల్లో 4,386 మంది మహారాష్ట్ర నుంచి వచ్చినవారు కాగా, వారిని కలిసినవారు 1340మంది కావడం గమనార్హం. అలాగే, విదేశాల నుంచి వచ్చినవారు 216 మంది కాగా; దిల్లీ నుంచి 87, తమిళనాడు 67, గుజరాత్‌ 62 మందికి చొప్పున కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు సీఎం తెలిపారు. కరోనా కట్టడికి తమ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందన్నారు. భౌతికదూరం పాటించడం, మాస్క్‌లు ధరించడం ద్వారా ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం విధించిన నిబంధనలు పాటించని వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మాస్క్‌లు ధరించకపోతే తొలుత రూ.200లు ఫైన్‌ విధిస్తామన్నారు. 

రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటిదాకా 7వేల కేసులు నమోదైతే వారిలో 3955 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 86మంది ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటకలో ప్రస్తుతం 2956 యాక్టివ్‌ కేసులు మాత్రమే ఉన్నాయి. వీరిలో 16మంది ఐసీయూలో ఉన్నారు. రాష్ట్రంలో మరణాల రేటు 1.2శాతం కాగా.. రికవరీ రేటు 56.6శాతంగా ఉన్నట్టు సీఎం తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని