సరిహద్దు ఘర్షణలపై 19న అఖిలపక్ష భేటీ

తాజా వార్తలు

Published : 17/06/2020 15:04 IST

సరిహద్దు ఘర్షణలపై 19న అఖిలపక్ష భేటీ

దిల్లీ: భారత్‌-చైనా సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. ఈ నెల 19న సాయంత్రం 5 గంటలకు అన్ని పార్టీల అధ్యక్షులతో గాల్వాన్‌ ఘర్షణలు సహా ఇతర అంశాలపై చర్చించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ సమావేశం జరగనున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం ట్విటర్‌ వేదికగా వెల్లడించింది.

లద్దాఖ్‌లోని గాల్వాన్‌ లోయలో చైనాతో ఘర్షణలో 20 మంది సైనికులు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. దీంతో సరిహద్దులో నెలకొన్న పరిస్థితులపై తాజా పరిస్థితులపై మంగళవారం సాయంత్రమే కేంద్ర ప్రభుత్వం వివిధ స్థాయిల్లో సమావేశాలు నిర్వహించింది. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వరుసగా సమావేశాలు నిర్వహించారు. ఈ ఘర్షణకు సంబంధించిన వివరాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వివరించారు. దాదాపు గంట పాటు వీరి మధ్య భేటీ జరిగింది. అంతకుముందు రాజ్‌నాథ్‌.. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జయ్‌శంకర్‌, త్రిదళాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌, త్రివిధ దళాల అధిపతులతో సమావేశమై సమీక్ష నిర్వహించారు.

తీవ్రమైన ఈ అంశంపై వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని మంగళవారం కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితుల్ని అన్ని రాజకీయ పార్టీలకు వివరించాలని కోరింది. లద్దాఖ్‌లో నెలకొన్న ప్రతిష్టంభనపై ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని డిమాండ్‌ చేసింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని