‘ప్రధాని వ్యాఖ్యలను వివాదాస్పదం చేస్తున్నారు’

తాజా వార్తలు

Published : 20/06/2020 16:00 IST

‘ప్రధాని వ్యాఖ్యలను వివాదాస్పదం చేస్తున్నారు’

కాంగ్రెస్‌ విమర్శలపై స్పందించిన కేంద్రం

దిల్లీ: దేశ సరిహద్దుల్లోకి ఎవ్వరూ చొరబడలేదన్న ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలకు దురుద్దేశాన్ని ఆపాదించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం వ్యాఖ్యానించింది. 20 మంది సైనికుల వీర మరణం తర్వాత నెలకొన్న పరిస్థితులను ఉద్దేశించి ప్రధాని ఆ వ్యాఖ్యలు చేశారని వివరణ ఇచ్చింది. మన సైనికుల బలిదానాలు చైనా కుయుక్తులను తిప్పికొట్టాయని వెల్లడించింది. గల్వాన్‌ లోయలో జూన్‌ 15న జరిగిన అతిక్రమణ విషయంలో చైనా ఎట్టకేలకు వెనక్కి తగ్గిందని తెలిపింది. ఆ ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టాలన్న అంశంలోనూ తోకముడిచిందని పేర్కొంది. ఈ మేరకు శనివారం ప్రధాని కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

భారత భూభాగంలోకి చైనా ప్రవేశించని పక్షంలో మన సైనికులు ఎందుకు మరణించారని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ప్రశ్నించిన విషయం తెలిసిందే. అలాగే మన భూభాగంలో ఉన్న గల్వాన్‌ లోయ తమదేనని చైనా ప్రకటించడంపై ప్రధాని తక్షణమే వివరణ ఇవ్వాలని కాంగ్రెస్‌ కోరింది. దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా వివరణ ఇచ్చింది. దేశ రక్షణలో సైనికులు ప్రాణాలు కోల్పోయిన తరుణంలో ప్రధాని వ్యాఖ్యలను వివాదాస్పదం చేయడం విచారకరమని అభిప్రాయపడింది. వాస్తవాధీన రేఖను అతిక్రమించేందుకు చేసే అన్ని కుట్రలను భారత్‌ దీటుగా తిప్పికొడుతుందని స్పష్టం చేసింది. 

దేశ సరిహద్దుల్లోకి ఎవ్వరూ చొరబడలేదని, ఎలాంటి చొరబాటూ జరగలేదని ప్రధాని మోదీ శుక్రవారం జరిగిన అఖిలపక్ష భేటీలో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. మన పోస్టుల్లో ఏదీ ఇంకొకరి కబ్జాలో లేదన్నారు. దేశ రక్షణ పట్ల ఎవరికీ వీసమెత్తు అనుమానం అక్కర్లేదని భరోసా ఇచ్చారు. ఈ నెల 16న గల్వాన్‌ లోయలో చైనా బలగాలతో చోటుచేసుకున్న ఘర్షణలో 20 మంది భారత జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. దీనిపై వాస్తవ పరిస్థితుల్ని మోదీ నిన్న జరిగిన అఖిలపక్ష భేటీలో విపక్ష పార్టీలకు వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని