కరోనాకు ‘పతంజలి’ మందు

తాజా వార్తలు

Updated : 23/06/2020 14:35 IST

కరోనాకు ‘పతంజలి’ మందు

హరిద్వార్‌ : ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనాకు ఆయుర్వేద మందు తీసుకువచ్చినట్లు ప్రముఖ దేశీయ కంపెనీ పతంజలి పేర్కొంది. ‘కొరోనిల్‌’ పేరుతో ఈ మందును మార్కెట్‌లోకి తీసుకువచ్చినట్లు  ఆ సంస్థ సహ వ్యవస్థాపకులు బాబా రాందేవ్‌ తెలిపారు. హరిద్వార్‌లోని యోగ్‌పీఠ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ మందును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాందేవ్‌ మాట్లాడుతూ..  

‘కరోనా మహమ్మారితో ప్రపంచదేశాలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. ఇలాంటి విపత్కర సమయంలో మందు తీసుకురావడం ముఖ్యమైన ప్రక్రియ. ఆయుర్వేదంతో కరోనాను నయం చేయవచ్చు. ఈ మందుతో మూడు రోజుల పరిశీలనలో 69 శాతం మందికి నెగిటివ్‌ రావడం శుభసూచకం. అలాగే 7 రోజుల్లో వంద శాతం మంది కోలుకున్నారు. మందును తీసుకురావడంలో మా శాస్త్రవేత్తలు చేసిన కృషి అభినందనీయం’ అని రాందేవ్‌ పేర్కొన్నారు.

‘కొరోనిల్’‌ మాత్రల ద్వారా 14 రోజుల్లో కరోనాను నయం చేయవచ్చని పతంజలి సంస్థ పేర్కొంది. కరోనావైరస్‌కు మందును తీసుకువస్తున్నామని గతంలోనే పతంజలి సీఈవో ఆచార్య బాలకృష్ణ తెలిపారు. తమ మందు 5 నుంచి 14 రోజుల్లో కొవిడ్‌ను నయం చేయగలదని పేర్కొన్నారు.

వారం రోజుల్లో అందుబాటులోకి..

కరోనిల్‌ కిట్‌ ధరను రూ.545గా నిర్ణయించినట్లు పతంజలి చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ ఆచార్య బాలకృష్ణ తెలిపారు. ఇది 30రోజులకు సరిపోతుందని పేర్కొన్నారు. ‘ప్రస్తుతం ఇది అన్నిచోట్లా లభ్యం కాదు. కేవలం పతంజలి స్టోర్స్‌లోనే లభిస్తుంది. అందుకు మరో వారం రోజుల సమయం పట్టవచ్చు’ అని రాందేవ్‌ బాబా అన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని