కరోనా ఎఫెక్ట్‌: ప్రధాని వివాహం మూడో ‘సారీ’...

తాజా వార్తలు

Published : 26/06/2020 12:49 IST

కరోనా ఎఫెక్ట్‌: ప్రధాని వివాహం మూడో ‘సారీ’...

డెన్మార్క్‌ ప్రధాన మంత్రి వివాహానికి కొవిడ్‌ విఘ్నం

కోపెన్‌హేగన్‌: మహమ్మారి కరోనా వైరస్‌ సెగ ప్రపంచ వ్యాప్తంగా అనేక శుభకార్యాలు, వివాహాలకు తగిలింది. అయితే దేశ ప్రధాన మంత్రులకు కూడా ఇందుకు మినహాయింపు లేకపోవటం గమనార్హం. కాగా, కరోనా ఎఫెక్ట్‌ వల్ల డెన్మార్క్‌ ప్రధానమంత్రి మెట్టె ఫ్రెడ్రిక్‌సన్‌ వివాహ ప్రయత్నం మూడోసారి వాయిదా పడింది. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని మెట్టె ప్రకటించారు. తన కాబోయే భర్తతో కలిసి ఉన్న చిత్రాన్ని సామాజిక మాధ్యమాల్లో ఆమె షేర్‌ చేశారు.

‘‘ఈ అద్భుతమైన వ్యక్తిని వివాహం చేసుకునేందుకు ఎదురుచూస్తున్నాను. కానీ అదంత సులభమయ్యేలా కనిపించటం లేదు. జులైలో మేము వివాహం చేసుకుందామనుకున్న రోజే నేను బ్రస్సెల్స్‌లో ఓ ముఖ్యమైన సమావేశానికి హాజరు కావాల్సి ఉంది. అయితే డెన్మార్క్‌ క్షేమం కోసం నేను నా కర్తవ్యాన్ని నిర్వహించాలి. దీనితో మేము మా ప్రణాళికను మళ్లీ మార్చుకున్నాం. అయితే త్వరలోనే మేం వివాహం చేసుకుంటాం. ఎంతో ఓర్పుతో ఎదురుచూస్తున్నా బో (ప్రధాని కాబోయే భర్త).’’ అని డెన్మార్క్‌ ప్రధాని వివరించారు.

బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో జులై 17, 18 తేదీలలో ‘అసాధారణ యూరోపియన్‌ కౌన్సిల్‌’ సమావేశం జరగనుంది. దీనిలో యూరోపియన్‌ యూనియన్‌కు చెందిన 27 దేశాల నేతలు వీడియో సమావేశం ద్వారా పాల్గొననున్నారు. కొవిడ్‌-19 మహమ్మారి ప్రభావంతో కొద్ది నెలలపాటు అమలులో ఉన్న లాక్‌డౌన్‌ అనంతరం దేశాధినేతలు సమావేశం కావటం ఇదే తొలిసారి. ఈ కీలక సమావేశంలో కొత్త నూతన యూరోపియన్‌ యూనియన్‌ బడ్జెట్‌, కొవిడ్‌ మహమ్మారిని ఎదుర్కొనే వ్యూహాల వంటి ముఖ్యాంశాలు చర్చకు రానున్నాయి. ఈ నేపథ్యంలో దేశ క్షేమం కోసం తన వివాహాన్ని వాయిదా వేసుకున్న తమ మహిళా ప్రధానిపై డెన్మార్క్‌ ప్రజలు ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని