ఆకలి కన్నా కరోనానే ఎంతో మేలు..!

తాజా వార్తలు

Published : 28/06/2020 10:20 IST

ఆకలి కన్నా కరోనానే ఎంతో మేలు..!

లఖ్‌నవూ: సాఫీగా సాగిపోతున్న ఎందరో జీవితాలను కరోనా తలకిందులు చేసింది. ముఖ్యంగా రోజువారీ కూలీలు, వలస కార్మికులు..ఉపాధి కోల్పోయి చేతిలో చిల్లిగవ్వలేక కాలి నడకన సొంత ఊర్లకు పయనమై ప్రాణాలు కోల్పోయారు. అలా బతికుంటే చాలు అనుకుని సొంత ఊర్లకు చేరుకున్న వారే ఇప్పుడు ఆకలితో చనిపోవడం కంటే కరోనాతో చనిపోయినా ఫర్వాలేదు అని అనుకునేంతగా వారి జీవితాలను ఈ వైరస్‌ మహమ్మారి ప్రభావితం చేసింది.

కరోనా లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించడంతో వలస కార్మికులు ఉపాధి కోసం తిరుగుపయనమవుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖపూర్‌ పరిసర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో ఉపాధిని వెతుక్కుంటూ మహారాష్ట్ర, గుజరాతోపాటు ఇతర రాష్ట్రాలకు వస్తున్నారు. ‘‘ఇక్కడే పని దొరికితే నేను తిరిగి వెళ్లేవాడిని కాదు. మా సంస్థ ఇంకా తెరుచుకోలేదు. కానీ, ఏదో ఒక పని దొరుకుతుందేమోనని నేను తిరిగి వెళుతున్నాను.  నా పిల్లలు ఆకలితో చనిపోయే కంటే నేను కరోనాతో చనిపోవడమే మేలు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు 30 ఏళ్ల అన్సారీ. లాక్‌డౌన్‌ తర్వాత పరిశ్రమలు మూతబడటంతో ఉపాధి కోల్పోయి సొంత గ్రామానికి వచ్చిన అన్సారీకి స్థానికంగా ఎలాంటి పని దొరక్కపోవడంతో తిరిగి మహారాష్ట్రకు బయల్దేరాడు.

దివాకర్ ప్రసాద్ అనే వ్యక్తి కోల్‌కతాలో ఒక పరిశ్రమలో టెక్నీషియన్‌గా పనిచేసేవాడు. హోలి పండుగకు ఊరికి వచ్చి లాక్‌డౌన్‌తో అక్కడే ఉండిపోయాడు. లాక్‌డౌన్‌ తర్వాత తిరిగి పరిశ్రమలు తెరుచుకోవడంతో కోల్‌కతాకు పయనమయ్యాడు. ‘‘కరోనాతో పనిలోకి వెళ్లాలంటే భయంగానే ఉంది. కానీ, పని లేకపోతే నా కుటుంబాన్ని పోషించుకునేది ఎలా, అందుకే తిరిగి పనిలోకి వెళుతున్నా’’ అని తెలిపాడు. ‘‘ముంబయిలో ఉంటే చేతినిండా డబ్బు ఉండేది. కానీ ఇక్కడ (ఉత్తరప్రదేశ్‌) చాలా కష్టంగా ఉంది. వలస కార్మికుల కోసం ప్రభుత్వం ప్రకటించిన పథకాలు ఏవీ మా వరకు రాలేదు. దీంతో ఉపాధిలేక ఖాళీగా ఉండాల్సి వస్తోంది. అందుకే ముంబయికి వెళిపోతున్నా’’ అని  తెలిపాడు 20 ఏళ్ల మహ్మద్‌ అబిద్‌ అనే యువకుడు.

ప్రభుత్వం రేషన్ ద్వారా నిత్యవసరాలు అందిస్తున్నప్పటికీ ఇతర అవసరాలకు డబ్బు కావాలి కదా. అందుకే కరోనా భయం ఉన్నా పనిలోకి వెళ్లక తప్పడంలేదు అని మరో వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలా దాదాపు 30 లక్షల మంది వరకు వలస కార్మికులు ఉపాధి నిమిత్తం వేరే రాష్ట్రాలకు పయనమవుతున్నట్లు సమాచారం. మరోపక్క ఎమ్‌ఎన్‌ఆర్‌ఈజీఏ ద్వారా రికార్డు స్థాయిలో ఉపాధి కల్పించామని ప్రభుత్వం చెబుతుండటం గమనార్హం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని