ఆ విషయం వెల్లడిస్తే జిన్‌పింగ్‌ సీటుకే ఎసరు?

తాజా వార్తలు

Updated : 01/07/2020 18:30 IST

ఆ విషయం వెల్లడిస్తే జిన్‌పింగ్‌ సీటుకే ఎసరు?

ఆసక్తికర విషయాల్ని వెల్లడించిన సీసీపీ మాజీ నేత తనయుడు

ఇంటర్నెట్‌ డెస్క్‌: గల్వాన్‌ ఘర్షణలో అమరులైన జనాన్ల సేవల్ని గుర్తించిన భారత ప్రభుత్వం వారికి ఘనంగా అంత్యక్రియలు నిర్వహించింది. వారి త్యాగాన్ని యావత్తు దేశం కొనియాడింది. ప్రతి పౌరుడు వారి కుటుంబాలకు సంఘీభావం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వాలు వారి కుటుంబసభ్యులకు అండగా నిలిచాయి. కానీ, చైనా మాత్రం ఇప్పటి వరకు తమ సైనికులు చనిపోయినట్లు కూడా అధికారికంగా అంగీకరించలేదు. దాదాపు 44 మంది మృతిచెంది ఉంటారని మన వర్గాలు అంచనా వేశాయి. అయితే, ఈ విషయాన్ని అంగీకరిస్తే షీ జిన్‌పింగ్‌ సీటుకు ఎసరు తప్పదని తెలుస్తోంది. కొన్నేళ్లుగా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ(పీఎల్‌ఏ)లో ఉన్న వ్యతిరేకత ఒక్కసారిగా బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే చైనా కమ్యూనిస్టు పార్టీ(సీసీపీ) ఆగడాలకు కొమ్ముకాస్తుండడం పీఎల్‌ఏలోని ఓ వర్గానికి అసలు ఇష్టం లేదట. అలాగే మాజీ సైనికాధికారులు సైతం జిన్‌పింగ్‌ తీరుపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. ఈ విషయాలను సీసీపీకి చెందిన ఓ మాజీ నేత కుమారుడు జియాన్‌లీ యాంగ్‌ వెల్లడించారు. ఈ మేరకు ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ‘వాషింగ్టన్‌ పోస్ట్‌’లో ఆయన ఓ వ్యాసాన్ని ప్రచురించారు. ఆ కథనం ప్రకారం....

ఒక్క అవకాశం కోసం..

అధికారం సీపీపీ వద్దే ఉండడంలో పీఎల్‌ఏ కీలక పాత్ర పోషిస్తోంది. ఒకవేళ పీఎల్‌ఏలోని సైనికుల మనోభావాలు దెబ్బతింటే వారంతా అసంతృప్తిగా ఉన్న లక్షలాది మంది మాజీ సైనికులతో చేతులు కలుపుతారు. వాణిజ్య కార్యకలాపాల నుంచి పీఎల్‌ఏను దూరం పెట్టడం వంటి పలు నిర్ణయాల వల్ల అనేక మంది మాజీ సైనికాధిరులు జిన్‌పింగ్‌ నాయకత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వీరంతా ఏకమైతే జిన్‌పింగ్‌ పాలనను ఎదిరించే బలమైన శక్తిగా ఏర్పడవచ్చు. ఈ బృందం ప్రస్తుతం అవకాశం కోసం ఎదురుచూస్తోంది. ఈ తరుణంలో భారత్‌తో జరిగిన ఘర్షణలో ప్రత్యర్థి కంటే ఎక్కువ మంది సైనికుల్ని కోల్పోయామని చైనా అంగీకరిస్తే.. దేశీయంగా తీవ్ర స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు వెల్లువెత్తే అవకాశం ఉంది. 

నిరసనల్ని అణచివేయలేరా..

ఇక్కడ అసలు విషయమేమిటంటే.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాజీ సైనికులు చేయబోయే సాయుధ పోరాటాన్ని అణగదొక్కే సాహసం జిన్‌పింగ్‌ యంత్రాంగం చేసే పరిస్థితులు లేవు. దీంతో ఇప్పటికే క్షేత్ర స్థాయిలో తరచూ జరుగుతున్న నిరసనలు, ఆందోళనలు జిన్‌పింగ్‌, ఆయన పార్టీ నాయకత్వానికి తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఎన్ని వ్యూహాలు రచించినా ఈ నిరసన సెగలు చల్లారడం లేదు. దాదాపు 5.7 కోట్ల మంది మాజీ సైనికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. వీరంతా క్షేత్ర స్థాయిలో ఇప్పటికే భారీ స్థాయిలో నిరసనలు, ఆందోళనలు చేపడుతున్నారు. సరిహద్దుల్లో ప్రాణాలు కోల్పోతున్న వారి త్యాగాల్ని గుర్తించడంలో ప్రభుత్వం విఫలమవుతోందంటూ ప్రజలకు వాస్తవ పరిస్థితుల్ని వివరిస్తున్నారు. వియత్నాం యుద్ధం, కొరియా యుద్ధంలో పోరాడిన వారి సేవల్ని ఏమాత్రం గౌరవించని ఉదంతాల్ని తెలియజేస్తున్నారు. 

దుర్భరంగా మాజీ సైనికుల జీవితాలు..

గతంలో పలు యుద్ధాల్లో పాల్గొన్న చైనా మాజీ సైనికుల జీవితాలు దుర్భర స్థితిలో ఉన్నాయి. పింఛన్లు ఇతరత్రా ప్రయోజనాలు కల్పించేందుకు సీసీపీ ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఓ సరైన వ్యవస్థే లేదు. దీంతో వారంతా స్థానిక ప్రభుత్వాలపై ఆధారపడాల్సి వస్తోంది. నిధుల పరిమితుల దృష్ట్యా ఆ ప్రభుత్వాలు వారికి చాలా తక్కువ మొత్తంలో సాయం చేయగలుగుతున్నాయి. దీంతో వృద్ధాప్యంలో బతుకు వెళ్లదీసేందుకూ నానా యాతన పడాల్సి వస్తోంది. వీరి పరిస్థితిని గమనిస్తున్న ప్రస్తుత సైనికులు జిన్‌పింగ్‌ తీరు పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలోనే జిన్‌పింగ్‌ ప్రభుత్వం మృతుల సంఖ్యను వెల్లడించడానికి భయపడుతోందని జియాన్‌లీ యాంగ్‌ తెలిపారు. ఈ సందర్భంగా భారత ప్రభుత్వం వీర సైనికుల అంత్యక్రియలను ఘనంగా జరపడాన్ని యాంగ్‌ ప్రస్తావించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని