నేపాల్ ఆర్మీ చీఫ్‌తో ప్రధాని ఓలీ భేటీ

తాజా వార్తలు

Published : 05/07/2020 21:07 IST

నేపాల్ ఆర్మీ చీఫ్‌తో ప్రధాని ఓలీ భేటీ

కాఠ్‌మాండూ: నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి ఆదివారం ఆ దేశ సైనికాధిపతి జనరల్ పూర్ణ చంద్ర థాపాతో సమావేశమయినట్లు సమాచారం. కొన్ని రోజులుగా కేపీ శర్మ ఓలి ప్రధాని పదవికి రాజీనామా చేయాలని నేపాల్ కమ్యూనిస్టు పార్టీ (ఎన్‌సీపీ) నేతల నుంచి ఒత్తిళ్లు పెరుగుతున్న నేపథ్యంతో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

అంతకు ముందు ఎన్‌సీపీ సీనియర్‌ నాయకుడు పుష్ప కమల్‌ దహాల్ ప్రధాని కేపీ ఓలీతో సమావేశమయ్యారు. అయితే ఈ భేటీలో ఇరు నేతల మధ్య ఎలాంటి ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సోమవారం మరో మారు చర్చలు జరగనున్నట్లు సమాచారం. దీనికి ముందు దహాల్ నేపాల్ అధ్యక్షురాలు బిద్యాదేవీ భండారీతో భేటీ అయినట్లు వార్తలు వెలువడ్డాయి. కేపీ శర్మ ఓలీ భవిత్యంపై నిర్ణయం తీసుకునేందుకు ఎన్‌సీపీ సోమవారం కీలక సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం.

ఏకపక్ష నిర్ణయాలు, భారత్‌తో సరిహద్దు వివాదం నేపథ్యంలో ఓలీ రాజీనామాకు సొంత పార్టీ నేతలైన దహాల్, మాధవ్‌ నేపాల్, జలనాథ్‌ ఖానాల్, బామ్‌దేవ్ గౌతమ్‌ వంటి వారు తీవ్రంగా పట్టుబట్టారు. పదవి నుంచి వైదలిగేందుకు ఓలీ సుముఖంగా లేరని, పూర్తి కాలం పదవిలో కొనసాగేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేసినట్లు స్థానిక వార్తా పత్రికలు పేర్కొన్నాయి. మరోవైపు తనను పదవి నుంచి తప్పించేందుకు ప్రయత్నిస్తే పార్టీ రెండుగా చీలిపోతుందని ఓలీ వ్యాఖ్యానించినట్లు సమాచారం.

భారత భూభాగాన్ని తమదిగా చూపుతూ సవరించిన చిత్రపటాన్ని నేపాల్‌ పార్లమెంటు ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని పార్టీలోని కొన్ని వర్గాలు వ్యతిరేకించాయి. ఈ నేపథ్యంలో తన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు నేపాల్‌లోని భారత దౌత్య కార్యాలయం కుట్ర పన్నుతోందని ఓలీ విమర్శించారు. భారత ప్రాంతాలను చూపుతూ నేపాల్‌ రేఖా చిత్రపటాల సవరణ బిల్లును ప్రవేశపెట్టినప్పటి నుంచి తనపై కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని