చైనా బ‌ల‌గాలు వెన‌క్కి..!
close

తాజా వార్తలు

Published : 06/07/2020 14:34 IST

చైనా బ‌ల‌గాలు వెన‌క్కి..!

గ‌ల్వాన్ లోయ నుంచి వెనుదిరిగిన భార‌త్‌, చైనా సైన్యం
చ‌ర్చ‌ల పురోగ‌తిలో భాగ‌మేన‌న్న అధికారులు 

ల‌ద్దాఖ్‌: గ‌ల్వాన్ ఘ‌ర్ష‌ణ‌ అనంతరం వాస్త‌వాధీన రేఖ వెంబ‌డి ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్న విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న అనంతరం జ‌రిగిన ప‌రిణామాలతో సరిహ‌ద్దు ప్రాంతం నుంచి తొలిసారిగా చైనా బ‌ల‌గాలు వెన‌క్కి త‌గ్గాయి. ఇరుదేశాల కోర్‌ క‌మాండ‌ర్ స్థాయి అధికారులు జ‌రిపిన‌ చ‌ర్చ‌లు పురోగ‌తి సాధించ‌డంతో స‌రిహ‌ద్దు‌ నుంచి చైనా బ‌ల‌గాలు కిలోమీట‌రు మేర వెన‌క్కి వెళ్లినట్లు సైనికవర్గాలు వెల్ల‌డించాయి. అంతేకాకుండా గ‌ల్వాన్లోయ వ‌ద్ద అక్ర‌మంగా ఏర్పాటుచేసుకున్న‌‌ గుడారాల‌ను కూడా చైనా సైన్యం తొల‌గించిన‌ట్లు పేర్కొన్నాయి. చ‌ర్చ‌ల్లో భాగంగా వాస్త‌వాధీన రేఖ వెంబ‌డి ఇరుదేశాలు బ‌ఫ‌ర్‌ జోన్ నిర్ధేశించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆ ప్రాంతం నుంచి భార‌త బ‌ల‌గాలు కూడా కిలోమీట‌రు మేర వెన‌క్కి వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. అయితే, ప్ర‌స్తుతం భార‌త్ కూడా వెన‌క్కి త‌గ్గిన‌ప్ప‌టికీ ఇది చ‌ర్చ‌ల్లో భాగ‌మేన‌ని..ఆ ప్రాంతాల‌న్ని చైనాకు అప్ప‌గించిన‌ట్లు కాద‌ని భార‌త అధికారులు పున‌రుద్ఢాటించారు.

అంత‌కుముందు, లద్దాఖ్‌లో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఆక‌స్మిక ప‌ర్య‌ట‌న‌తో చైనా ఉలిక్కిప‌డిన విష‌యం తెలిసిందే. ఆ స‌మ‌యంలో సైనికుల‌నుద్దేశించి మోదీ చేసిన ప్ర‌సంగంలో విస్త‌రణ‌వాద శ‌కం ముగిసిందంటూ చైనాకు ప‌రోక్షంగా చుర‌క‌లంటించారు. గ‌ల్వాన్ ఘ‌ర్ష‌ణలో 20మంది భార‌త సైనికులు అమ‌రులైన అనంత‌రం భార‌త్-చైనా స‌రిహ‌ద్దులో ఏర్ప‌డ్డ ఉద్రిక్త వాతావ‌ర‌ణాన్ని చ‌ల్లార్చేందుకు ఇరుదేశాల సైనికాధికారులు గ‌త‌వారం మూడోసారి భేటీ అయ్యారు. దాదాపు 12గంట‌ల‌పాటు జ‌రిగిన‌ సంప్ర‌దింపుల అనంత‌రం తాజా ప‌రిణామం చోటుచేసుకుంది. ముందుజాగ్ర‌త్త చ‌ర్య‌గా స‌రిహ‌ద్దు ప్రాంతంలో భార‌త్ భారీగా సైన్యాన్ని మోహ‌రించింది. అయితే, తాత్కాలిక పురోగ‌తి అనంత‌ర‌ ప‌రిణామాల‌ను మాత్రం భార‌త సైన్యం నిశితంగా ప‌రిశీలిస్తోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని