
తాజా వార్తలు
ప్రపంచంలోనే అత్యంత చిన్న మెమరీ సాధనం
అమెరికా శాస్త్రవేత్తల ఘనత
హ్యూస్టన్: ప్రపంచంలోనే అత్యంత చిన్న మెమరీ సాధనాన్ని అమెరికాలోని టెక్సాస్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. చిన్నపాటి మెమరీ సాధనాల్లో నిల్వ సాంద్రతను పెంచేందుకు అవసరమైన భౌతికశాస్త్ర నియమాలను పరిశోధకులు గుర్తించారు. వాటిలోని అత్యంత సూక్ష్మమైన రంధ్రాలతో అ సామర్థ్యాన్ని సాధించొచ్చని తేల్చారు. ‘‘ఆ నానో రంధ్రంలోకి ఒక లోహపు పరమాణువును ప్రవేశపెట్టాలి. ఫలితంగా ఆ పరమాణువు తన విద్యుత్ వాహక సామర్థ్యంలోని కొంత భాగాన్ని నిల్వ సాధనానికి కట్టబెడుతుంది. ఆ పరికరంలో డేటా నిల్వ సామర్థ్యం పెరగడానికి ఇది దోహదపడుతుంది’’ అని పరిశోధనలో పాలుపంచుకున్న దేజి అకిన్వాండే చెప్పారు. ప్రస్తుతం అత్యంత పలుచటి మెమరీ సాధనంగా ‘ఆటమ్రిస్టర్’ గుర్తింపు పొందింది. దీని మందం ఒక పరమాణు పొర స్థాయిలో ఉంటుంది. కొత్త పరిజ్ఞానంతో దీని పరిమాణాన్ని శాస్త్రవేత్తలు మరింత తగ్గించారు. ఫలితంగా దాని వెడల్పు ఒక చదరపు నానోమీటరుకు పరిమితమైంది. పరిశోధనలో భాగంగా మోలిబ్డినమ్ డైసల్ఫైడ్ పదార్థాన్ని ఉపయోగించారు. తాజా సాధనం.. చదరపు సెంటీమీటరుకు 25 టెరాబిట్ల నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉండడం విశేషం.