
తాజా వార్తలు
ఆ రకంగానూ ట్రంప్‌ది రికార్డే
ఆయన విసిరేసిన దస్త్రాలను వెతికి పట్టుకోవడం ఆషామాషీ కాదు
శ్వేతసౌధం సిబ్బందికి ఇదో తలనొప్పి
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా గద్దె దిగిపోబోతున్న డొనాల్డ్ ట్రంప్ తన వ్యవహార శైలిపరంగా మరో రికార్డునూ సృష్టించేలా ఉన్నారు. తన వద్దకు వచ్చిన దస్త్రాల్లో కొన్నింటిని చించి అవతల విసిరేయడం ఆయనకు అలవాటు. నిబంధనల ప్రకారం అధ్యక్షుడి దస్త్రాలను జాగ్రత్తగా భద్రపరచాల్సి ఉంది. దానికి విరుద్ధంగా ఆయనే వాటిని చెల్లాచెదురుగా విసిరి పారేస్తూ రావడంతో ఇప్పుడు వాటన్నిటినీ వెతికి పట్టుకుని ఒకచోటకు చేర్చడం శ్వేతసౌధ సిబ్బందికి తలనొప్పిగా మారింది. ఫైళ్లను ఇష్టానుసారం పడేసే అలవాటును మార్చుకోవాల్సిందిగా సిబ్బంది పలుమార్లు చెప్పినా ఆయన వినేవారు కాదని శ్వేతసౌధ రికార్డుల మాజీ విశ్లేషకుడు సాల్మన్ లార్టే చెప్పారు.
2018 నుంచి కనిపించకుండా పోయిన పత్రాలను వెతికిపట్టుకునే పని కోసం ఆయన అనేక గంటల సమయం వెచ్చించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో చేసిన సంభాషణపై దుబాసీ రాసిన నోట్సును ట్రంప్ తన ఆధీనంలో పెట్టుకున్నారు. రికార్డుల బదలాయింపులో చోటుచేసుకుంటున్న జాప్యం కారణంగా అవి ఎంతవరకు నిష్పాక్షికంగా ఉన్నాయనే ఆందోళన మరింతగా పెరుగుతోంది. అధ్యక్ష భవనంలో రికార్డులను సక్రమంగా నిర్వహించకపోవడం ఒక ఎత్తయితే కొన్నింటిని దాచిపెట్టమనడం, మరికొన్నింటిని నాశనం చేయాలని చెప్పడం వల్ల ఈ పరిస్థితి తప్పదని అంచనా వేస్తున్నారు. ‘అధ్యక్షుని రికార్డుల చట్టం’ ప్రకారం జాతీయ పురావస్తు విభాగ సలహా తీసుకుని, అమెరికా కాంగ్రెస్‌లో ప్రకటించిన తర్వాతే అధ్యక్షుడు ఏ రికార్డునైనా ధ్వంసం చేయాలి. అయితే పురావస్తు విభాగం ఇచ్చిన సలహాను పాటించాలనే నిబంధనేమీ లేదు.
ఎలక్ట్రానిక్ రూపంలోనే అయినా..
అధ్యక్షుడికి సంబంధించి చాలావరకు రికార్డులు ఎలక్ట్రానిక్ రూపంలోనే ఉంటాయి. ఆటోమేటిక్ బ్యాకప్ సదుపాయం వల్ల వివరాలు భద్రంగానే ఉంటాయని, అయితే అధ్యక్షుడే వద్దని చెప్పినప్పుడు మాత్రం అవి నమోదు కావని నిపుణులు చెబుతున్నారు. ఒబామా అధ్యక్షునిగా ఉన్నప్పుడు దాదాపు 3 కోట్ల పత్రాలు, 250 టెరాబైట్ల ఎలక్ట్రానిక్ రికార్డులు నమోదయ్యాయి. వీటిలో 150 కోట్ల ఈమెయిల్ పేజీలు కూడా ఉన్నాయి. ఇంతింత పరిమాణంలో దస్త్రాలను, ఇతర పత్రాలను తరలించడం, భద్రపరచడం ఆషామాషీ కాదు.
గత నవంబరులో జరిగిన ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోగానే చట్టప్రకారం రికార్డులను భద్రపరిచి, తరలించేందుకు సిబ్బంది సిద్ధమయ్యారు. ఓటమిని ఆయన ఒకపట్టాన ఒప్పుకోకపోవడం వల్ల ఇప్పుడు ఈ నెల 20లోగా పని పూర్తయ్యేలా కనిపించడం లేదు. తరలింపునకు అయ్యే బడ్జెట్టును అనేక వారాల పాటు విడుదల చేయకపోవడం ఒక కారణం. సమాచార స్వేచ్ఛ చట్టం కింద ట్రంప్ పాలనకు సంబంధించి ప్రజలు ఏదైనా సమాచారాన్ని తీసుకోవాలంటే ఐదేళ్లయినా నిరీక్షించాల్సి వస్తుంది.
ఇవీ చదవండి..
భారతీయులకు బైడెన్ పెద్దపీట!
బైడెన్ తొలి సంతకం వీటిపైనే..!